మావల్లే ధనవంతులయ్యారు.. మాకు ఓటు వేయరా? డీఎంకే మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

తమిళనాడు ముఖ్యమంత్రిగా స్టాలిన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత రాజకీయాల్లో ఒక్కసారిగా మార్పులొచ్చాయి. దివంగత సీఎం జయలలిత ఉన్న సమయంలో ప్రారంభించిన ‘అమ్మ కేంటీన్’ ను అలాగే కొనసాగిస్తామని ప్రకటించారు. దీంతో పాటు కోవిడ్ సలహాల విషయంలో ఏర్పాటు చేసిన సలహా మండలిలో అధికార పక్షం కంటే ప్రతిపక్ష సభ్యులనే ఎక్కువగా నియమించి అందరితో శభాష్ అనిపించుకున్నారు. ఇలా కొన్ని ఆదర్శవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ, అందరితో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఆయన మంత్రివర్గ సహచరుడు, రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి పీకే శేఖర్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, అధికార డీఎంకేకు కొత్త తలనొప్పి తెచ్చి పెట్టారు. ఉత్తరాది వారిపై మంత్రి శేఖర్ బాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాది వారు తమిళనాడులో జీవిస్తూ ధనవంతులుగా మారారని, అయినా డీఎంకేకు ఓటు వేయక, బీజేపీకి ఓటు వేశారని మండిపడ్డారు. ఈవీఎంల ద్వారా తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, అయినా, ఎవరు ఎవరికి ఓటు వేశారన్నది ఇట్టే పసిగట్టవచ్చని బెదిరింపులకు దిగారు. ‘‘ఉత్తరాది వారు ధనవంతులు కావడం నేను చూశా. బీజేపీ వల్ల కాలేదు. డీఎంకే వల్లే ధనవంతులుగా ఎదిగారు. అయినా మాకు ఓటు వేయనే లేదు. బీజేపీ వారికే వేశారు. అయినా మాకే ఓటు వేశారని అంటున్నారు. అలా చెబుతూ మోసం చేస్తున్నారు’’ అని శేఖర్ బాబు వ్యా్ఖ్యానించారు.