అందుకే 400 సీట్లు రావాలి : మోదీపై ఖర్గే విమర్శలు

ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 400 స్థానాలను కైవసం చేసుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి విమర్శలు గుప్పించారు. రాజ్యాంగాన్ని మార్చడానికి అవసరమైన మూడోవంతు మొజార్టీ లక్ష్యంగానే ఆ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలోని చన్నపట్నంలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ మేనిఫెస్టోపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. తమ ఎన్నికలు హామీలు ముస్లింలీగ్ ఆలోచనను ప్రతిబింబిస్తున్నాయని ప్రధాని మోదీ చెప్పడం పై ఖర్గే మండిపడ్డారు. మూడింట రెండొంతుల మెజార్టీ కోసం మోదీ చూస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే ఈ మెజార్టీ కావాలి. అందుకే 400 సీట్లు రావాలని మోదీ పిలుపునిస్తున్నారు అని ఖర్గే పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మారుస్తామని ప్రకటనలు చేస్తోన్న ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ నేతలను ప్రధాని ఎందుకు అడ్డుకోవడం లేదన్నారు. వారి మనసులోనే అది ఉందని, అందే జరగాలని కోరుకుంటున్నందువల్లే అటువంటి నేతలపై చర్యలు తీసుకోవడం లేదన్నారు.