Mumbai: త్రిభాషా విధానానికి మహా షాక్.. హిందీపై ఉత్తర్వులు వెనక్కు తీసుకున్న ఫడ్నవీస్ సర్కార్..

త్రిభాషా విధానానికి మరాఠా రాజకీయాలు ఎదురు తిరిగాయా..? శివసేన రాజకీయాంశంగా చేస్తుండడంతో.. ఫడ్నవీస్ సర్కార్ యూ టర్న్ తీసుకుందా..? ఇంతకూ మహా సర్కార్ ఎందుకు ప్రభుత్వ ఉత్తర్వులను వెనక్కు తీసుకుంది. దీనిపై మరాఠా భాషాభిమానులు ఏమంటున్నారు..? మరాఠా సర్కార్ ఎలా ముందుకెళ్లాలని తలపోస్తోంది.?
1 నుంచి 5 తరగతుల వరకు హిందీ భాషను తప్పనిసరిగా ప్రవేశపెట్టాలన్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తంకావడంతో త్రిభాషా విధానం అమలుపై ఇచ్చిన రెండు ప్రభుత్వ ఉత్తర్వులను మహారాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. భాషా విధానం ముందుకు సాగడానికి విద్యావేత్త నరేంద్ర జాదవ్ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. తాజా పరిణామం నేపథ్యంలో.. త్రిభాషా విధానానికి వ్యతిరేకంగా జులై 5న నిర్వహించతలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని మహారాష్ట్ర నవనిర్మాణ సేన(MNS), శివసేన (UBT)లు రద్దు చేసుకున్నాయి. అయితే మరాఠీల ఐక్యత కోసం ఆ రోజున ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే స్పష్టంచేశారు.
మరాఠీల మధ్య చీలిక తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం విఫలయత్నం చేసిందని ఆరోపించారు ఉద్ధవ్ ఠాక్రే. ప్రజల ఐక్యతను చూసి.. జీఆర్‌లను వెనక్కి తీసుకుందన్నారు. ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ ఠాక్రే 1 నుంచి 12 తరగతి వరకు త్రిభాషా విధానాన్ని ప్రవేశపెట్టాలన్న రఘునాథ్ మషేల్కర్ కమిటీ సిఫార్సులను అంగీకరించారని, ఆ విధాన అమలుపై ఒక కమిటీని ఏర్పాటు చేశారని ఫడణవీస్ ఆరోపించారు. దీన్ని ఉద్ధవ్ ఖండించారు. మషేల్కర్ కమిటీ సూచనలపై ఒక అధ్యయన బృందాన్ని మాత్రమే తాను ఏర్పాటు చేశానని, అయితే అది ఒక్కసారి కూడా సమావేశం కాలేదన్నారు.
ఇంగ్లిష్, మరాఠీ మీడియం పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు హిందీని తప్పనిసరి మూడో భాషగా చేస్తూ ఫడణవీస్ ప్రభుత్వం ఏప్రిల్ 16న ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత జూన్ 17న హిందీని ఐచ్ఛిక భాషగా చేస్తూ ప్రభుత్వం సవరించిన జీఆర్ ఇచ్చింది.