దేశంలో అత్యధిక వేతనం అందుకున్న భారతీయ సీఈవో
ప్రముఖ ఐటీ సంస్థ హెచ్‌సీఎల్ టెక్ ఇటీవల విడుదల చేసిన వార్షిక నివేదికలో గత ఏడాది తమ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) సి.విజయ్‌కుమార్‌కు రూ.123.13 కోట్ల వేతనం అందజేసినట్లు వెల్లడించింది. దీంతో విజయకుమార్ ప్రస్తుతం అత్యధిక వేతనం పొందుతున్న భారతీయ సీఈవోగా నిలిచారు. విజయకుమార్ ఆదాయంలో నాలుగింట మూడు వంతులు దీర్ఘ కాలిక ప్రయోజనాలతో పొందుపరచబడిందని కంపెనీ స్ఫష్టం చేసింది. తమ కంపెనీ నుంచి విజయ్ కుమార్ ఎటువంటి వేతనమూ పొందలేదని, అయితే తమ అనుబంధ సంస్థఅయిన హెచ్‌సీఎల్ అమెరికా ఇంక్ నుంచి దీర్ఘకాలిక ప్రోత్సాహకం సహా 16.52 మిలియన్ల డాలర్ల (రూ.123.13 కోట్లు) పారితోషికం అందుకున్నారని వార్షిక నివేదికలో వివరించింది.
విజయ్ కుమార్ వార్షిక మూల వేతనం రెండు మిలియన్ డాలర్లు కాగా, వేరియబుల్ పే కింద మరో మిలియన్ డాలర్లు పొందారని తెలిపింది. మార్చి 31తో ముగిసిన సంవత్సరానికి ఆయన 0.02 మిలియన్ డాలర్ల మొత్తం ఇతర ప్రయోజనాలను పొందారు. హెచ్‌సీఎల్ కంపెనీ దీర్ఘ కాలిక ప్రోత్సాహం కింద అందించిన 12.50 మిలియన్ డాలర్ల మొత్తంతో ఆయన జీవితం 16.52 మిలియన్ డాలర్లకు (రూ.123.13 కోట్లు) చేరుకుందని పేర్కొంది. 12.5 మిలియన్ డాలర్ల దీర్ఘకాలిక ప్రోత్సాహకం అందుకోవడం మినహా 2021-22లో ఆర్థిక సంవత్సరంలో విజయ్ కుమార్ వేతనంలో ఎటువంటి మార్పు లేదు. దీర్ఘకాలిక ప్రోత్సాహకం అనేది ఆయన చేరుకునే మైలురాళ్ల ఆధారంగా నిర్ణీత వ్యవధిలో (రెండు సంవత్సరాల ముగింపులో) చెల్లిస్తాం అని తెలిపింది.






