మొదట భరోసా… ఆ తర్వాతే ఓటింగ్ : మెహబూబా

జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికల కంటే ముందు ప్రజల్లో ఓ భరోసా కల్పించాల్సిన అవసరం ఉందని పీడీపీ నేత, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ అభిప్రాయపడ్డారు. ప్రజలు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని, ప్రజలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని, ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ‘‘ప్రజల్లో కాస్తలో కాస్త ఒత్తిడిని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. ప్రజలకు కాస్త ఊరట లభించిందన్నదే మా భావన. ప్రజలకు భరోసా కల్పించడానికే ప్రధాని సమావేశానికి హాజరయ్యాం’’ అని ముఫ్తీ ప్రకటించారు. మరోవైపు ఆర్టికల్ 370 పునరుద్ధరించే వరకూ తాను ఎన్నికల్లో పోటీ చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే ప్రజాస్వామ్యాన్ని అన్ని కోణాల్లోనూ వాడుకుంటామని, ఏ ఘటనను, సందర్భాన్ని విడిచిపెట్టమని అన్నారు. ఒకవేళ పోటీ చేస్తే రాజకీయ స్వలాభాల కోసం అనుకుంటారని తెలిపారు. పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారని, పార్టీ గెలిస్తే, వారిలో ఎవరో ఒకరు సీఎం పదవిలో ఉంటారని తెలిపారు. అంతేగానీ తాను మాత్రం సీఎం పదవిలో ఉండే ప్రసక్తే లేదని మెహబూబా తేల్చి చెప్పారు. ఉగ్రవాదుల ఏరివేతలో పై చేయి సాధించడం సైన్యం ఖాతాలోకి వస్తుందని, కేంద్ర ప్రభుత్వం పైచేయి సాధించినట్లు ఎంత మాత్రమూ కాదని తేల్చి చెప్పారు. అసలు రాష్ట్రంలో యువత తీవ్రవాదం వైపు ఎందుకు వెళ్తున్నారన్నది కేంద్రం ఆలోచించాలని మెహబూబా కోరారు.