Messi: రూ. 12 వేలు పెట్టి టికెట్ కొన్నాం.. మెస్సీ ముఖం కూడా కనిపించలే.. ఫ్యాన్స్ ఆగ్రహం
ఢిల్లీ: భారతీయ ఫుట్‌బాల్ అభిమానుల ఆరాధ్య దైవం, ప్రపంచ దిగ్గజం లియోనల్ మెస్సీని(Lionel Messi) దగ్గరగా చూడాలనే ఆశ కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో తీరలేదు. వేలాది మంది అభిమానుల కల చెదరడంతో, ఆ ఈవెంట్ తీవ్ర గందరగోళానికి, చివరికి గొడవకు దారితీసింది.
గ్రౌండ్లో ఏం జరిగింది?
మెస్సీని చూడటానికి వచ్చిన ఫ్యాన్స్‌తో ఉదయం స్టేడియం నిండిపోయింది. టికెట్ల కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టిన ఫ్యాన్స్, మెస్సీ గ్రౌండ్లోకి రాగానే నిరాశకు గురయ్యారు. మెస్సీ చుట్టూ రాజకీయ నేతలు, పోలీసు అధికారులు, ఇతర ప్రముఖులు భారీగా గుమిగూడారు. దీంతో గ్యాలరీల్లో ఉన్న సాధారణ అభిమానులకు మెస్సీ కనీసం కనిపించలేదు. మెస్సీ కేవలం 20 నిమిషాలు మాత్రమే అక్కడ ఉన్నాడు. ప్రణాళిక ప్రకారం స్టేడియం మొత్తం రౌండ్ కొట్టాల్సిన మెస్సీ, అదుపులేని ఆ వాతావరణం కారణంగా ఆ పని చేయలేదు.
అభిమానుల ఆగ్రహం – పోలీసుల జోక్యం
తమ అభిమాన ఆటగాడిని సరిగ్గా చూడలేకపోవడంతో ఫ్యాన్స్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారు “చీటర్, చీటర్” (మోసగాళ్లు) అని నినాదాలు చేస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. స్టేడియంలోని ప్లాస్టిక్ కుర్చీలను ధ్వంసం చేసి, వాటర్ బాటిళ్లను గ్రౌండ్లోకి విసిరేశారు. రూ.12 వేలు పెట్టి వస్తే కనీసం మెస్సీ ముఖం కూడా కనిపించలేదని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిస్థితి చేయి దాటడంతో, అల్లర్లను అదుపు చేయడానికి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. కొన్ని చోట్ల పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారని సమాచారం. ఈ ఉద్రిక్త పరిస్థితుల నడుమ మెస్సీని సురక్షితంగా అక్కడి నుంచి పంపించివేశారు.
నిర్వాహకుడి అరెస్ట్ – ముఖ్యమంత్రి క్షమాపణ
ఈ కార్యక్రమం విఫలం కావడానికి కారణం ప్రధానంగా నిర్వహణ లోపం (మిస్ మేనేజ్మెంట్) అని తేలింది. దీంతో కోల్‌కతా పోలీసులు ఈవెంట్ మెయిన్ ఆర్గనైజర్ అయిన శతద్రు దత్తాను అరెస్ట్ చేశారు. మరోవైపు, ఈ సంఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించి, విచారం వ్యక్తం చేశారు. నిర్వాహకుల వైఫల్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంటూ, మెస్సీకి, అలాగే స్టేడియానికి వచ్చిన అభిమానులందరికీ ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.






