‘నా తమ్ముడికి ఓటేస్తేనే నీళ్లిస్తాం’: డీకే శివకుమార్ కామెంట్స్‌పై కేసు నమోదు

లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలన్నీ జోరుగా ప్రచారాలు సాగిస్తున్నాయి. కర్ణాటకలో కూడా అధికార కాంగ్రెస్, విపక్ష బీజేపీలు పోటీ పడి మరీ ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర కాంగ్రెస్ నేత, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు సంబంధించిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. తన సోదరుడు సురేశ్ తరఫున శుక్రవారం ప్రచారం నిర్వహించిన డీకే.. తన తమ్ముడికి ఓటేస్తేనే నీటి సమస్య తీరుస్తామంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదులు అందడంతో ఆయనపై కేసు కూడా నమోదైంది. డీకే సోదరుడైన డీకే సురేశ్.. బెంగళూరు రూరల్ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ తన సోదరుడి తరఫున ప్రచారంలో పాల్గొన్నారు. ఓ హౌసింగ్ సొసైటీలో జరిగిన ప్రచార సభలో ప్రసంగించిన ఆయన.. ‘‘నేను ఇక్కడికి ఓ బిజినెస్ డీల్ కోసం వచ్చాను. నా తమ్ముడు సురేశ్‌కు ఓటేసి గెలిపిస్తేనే 3 నెలల్లో మీ ప్రధాన సమస్యలు పరిష్కరిస్తాం. కావేరీ నదీ జలాలు సరఫరా చేసి మీకు అవసరమైన నీటిని కూడా కేటాయిస్తాం’’ అని అన్నారు.
దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఈ వ్యవహారంపై విపక్ష బీజేపీ మండిపడింది.ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన బీజేపీ నేతలు.. తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇలా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, తన సోదరుడి కోసం ప్రజలను ప్రలోభపెట్టి ఓట్ల దోపిడీకి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారాన్ని పరిశీలించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. డీకే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించినట్లు ధ్రువీకరించడమే కాకుండా.. ప్రజలను ప్రలోభాలకు గురి చేసి ఎన్నికలను ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని తేల్చింది. ఫలితంగా ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు కర్ణాటక ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.