ఈ దేశాలలో ఓటు వేయకపోతే అంతే సంగతి..

ఈరోజు ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికల తో పాటు లోక్ సభ పోలింగ్ కూడా జరుగుతుంది. పోలింగ్ రోజు ఖచ్చితంగా సెలవు ఇవ్వాలి అని ఎన్నికల సంఘం ఆదేశం మేరకు చాలావరకు కంపెనీలు కూడా ఈ రోజున సెలవు ప్రకటిస్తాయి. ఇది ఓటర్ లు పోలింగ్ సెంటర్ కి వెళ్లి ఓటు వేయడం కోసం ఏర్పాటు చేసిన సౌలభ్యం. కానీ కొంతమంది దీన్ని సెలవుగా పరిగణించి ఓటు వేయకుండా హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేస్తారు. ఓటు వేస్తే వేద్దాం.. లేకపోతే హ్యాపీగా ఇంట్లో ఉండి సెలవు ఎంజాయ్ చేద్దాం అనుకునే వారు కూడా ఉన్నారు. అలా ఓటు వేయకుండా ఎగ్గొట్టినప్పుడు.. ఏదైనా శిక్ష గాని.. ఫైన్ గాని విధిస్తే ఎలా ఉంటుంది? మన దగ్గర లేకపోవచ్చు.. కానీ కొన్ని దేశాల్లో ఓటు వేయకపోతే శిక్షలు తప్పవు.. మరి ఆ దేశాలు ఏవి?.. ఆ శిక్షలు ఏమిటో? చూద్దాం పదండి..
అర్జెంటీనా: అర్జెంటీనాలో పొరపాటున ఎవరైనా ఓటు వేయకపోతే.. ఎందుకు వేయలేకపోయారు అనే వివరణ ప్రభుత్వానికి అందివ్వాల్సి ఉంటుంది. ఆ కారణం అధికారులు ఆమోదిస్తే పర్లేదు లేకపోతే ఫైన్ కట్టాల్సిందే…
పెరూ: పెరూ దేశంలో ఎన్నికలలో ఓటు వేసిన వారికి ఒక స్టాంపు కార్డును ఇస్తారు. అది చూపిస్తేనే రేషన్ సరుకుల దగ్గర నుంచి ప్రభుత్వం అందించే సేవల వరకు వాళ్లకు ఎలిజిబిలిటీ ఉంటుంది. పైగా ఓటు వేయనందుకు జరిమానా కూడా కట్టాల్సి ఉంటుంది.
సింగపూర్: సింగపూర్ లో పొరపాటున ఓటు వేయలేదనుకోండి వెంటనే వాళ్ళ పేరుని ఓటర్ జాబితా నుంచి తొలగిస్తారు. ఎందుకు ఓటు వేయలేకపోయారు అనే వివరణ పత్రం రాసిచ్చి.. కొద్దిగా జరిమానా కూడా కట్టిన తర్వాత వారి పేరును తిరిగి ఓటరు జాబితా నమోదు చేస్తారు.
బెల్జియం: బెల్జియం లో ఒకసారి ఓటేయకుంటే జరిమానా కట్టాల్సి ఉంటుంది. కానీ అదే వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోక పోతే జైలుకు వెళ్లక తప్పదు.
ఉత్తర కొరియా: నియంతృత్వ రాజ్యమైన ఉత్తర కొరియా లో జరిగే ఫెడరల్ ఎన్నికల్లో తప్పనిసరిగా అందరూ ఓటేయాల్సిందే. లేకపోతే వారిని దేశ ద్రోహులుగా పరిగణించి శిక్షలు విధిస్తారు.
ఇలా చాల దేశాలలో ఓటు హక్కు కచ్చితంగా వినియోగించుకోవాలి. అయితే ఇటువంటి దేశాలలో ఓటు వేయకపోతే చర్యలలో కొన్ని మినహాయింపులు ఉంటాయి. అనారోగ్యంతో బాధపడేవారు, ఇల్లు వదిలి రాలేని ముసలివారికి కొన్ని సడలింపులు వర్తిస్తాయి. కానీ మన దేశంలో మాత్రం ఇటువంటివి లేకపోవడం గమనార్హం.