CMs Meeting: జల వివాదాలపై కమిటీ..! సీఎంల భేటీలో కీలక నిర్ణయం..!!

ఢిల్లీలోని శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాల పరిష్కారంలో కీలక అడుగుగా నిలిచింది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (C R Patil) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (AP CM Chandrababu), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy), ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు. గంటన్నరపాటు సాగిన ఈ భేటీలో నీటి కేటాయింపులు, ప్రాజెక్టుల నిర్మాణం, శ్రీశైలం డ్యాం భద్రత వంటి అంశాలపై సమగ్ర చర్చ జరిగింది.
సమావేశంలో నాలుగు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిజర్వాయర్ల వద్ద నీటి తరలింపును ఖచ్చితంగా లెక్కించేందుకు టెలిమెట్రీ వ్యవస్థలను ఏర్పాటు చేయాలని ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, రక్షణ చర్యలను తక్షణమే చేపట్టాలని నిర్ణయించారు. దీనికి ఆంధ్రప్రదేశ్ అంగీకరించింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (KRMB) కార్యాలయాన్ని అమరావతిలో, గోదావరి నదీ యాజమాన్య బోర్డు (GRMB) కార్యాలయాన్ని హైదరాబాద్‌లో కొనసాగించాలని తీర్మానించారు. అలాగే కృష్ణా, గోదావరి జలాలు, బనకచర్ల ప్రాజెక్టుతో సహా పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం సాంకేతిక నిపుణులు, అధికారులతో కూడిన కమిటీని ఈ నెల 21 లోపు ఏర్పాటు చేయాలని, అవసరమైతే మరోసారి సమావేశం నిర్వహించాలని తీర్మానించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదించిన బనకచర్ల ప్రాజెక్టు (Banakacherla Project) ఈ సమావేశంలో చర్చకు రాలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి సముద్రంలో వృథాగా కలిసే 200 టీఎంసీల నీటిని రాయలసీమలోని కరువు ప్రాంతాలకు తరలించాలని ఏపీ లక్ష్యంగా పెట్టుకుంది. గోదావరిలో ఏటా 2500-3000 టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తుందని, ఈ ప్రాజెక్టు ఎగువ రాష్ట్రాలకు నష్టం కలిగించదని చంద్రబాబు వివరించారు. గత 11 ఏళ్లలో తెలంగాణ నిర్మించిన ఏ ప్రాజెక్టుకూ తాము అభ్యంతరం చెప్పలేదని, చివరి రాష్ట్రంగా మిగులు జలాలను వినియోగించుకునే హక్కు తమకు ఉందని ఏపీ వాదించింది.
తెలంగాణ 13 అంశాలను సమావేశంలో ప్రతిపాదించింది. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలకు అనుమతులు, శ్రీశైలం నుంచి వేరే బేసిన్‌కు నీటి తరలింపు నిలిపివేయాలని, ఉమ్మడి ఏపీలో ప్రారంభించిన తెలంగాణ ప్రాజెక్టులకు కృష్ణా ట్రైబ్యునల్‌లో ఏపీ సహకరించాలని కోరింది. అలాగే, తుంగభద్ర బోర్డు నీటి తరలింపు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై NGT ఉత్తర్వుల అమలు, శ్రీశైలం కుడి కాల్వ ద్వారా అధిక నీటి తరలింపు నియంత్రణ, హంద్రీనీవా, వెలిగొండ వంటి కొత్త ప్రాజెక్టుల నిర్మాణ నియంత్రణ, శ్రీశైలం డ్యాం భద్రత, ఇచ్చంపల్లి, సమ్మక్క-సారక్క ప్రాజెక్టులకు నిధులు, తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి సహకారం కోరింది.
సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశాన్ని తెలంగాణ విజయంగా అభివర్ణించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం టెలిమెట్రీ ఏర్పాటులో నిర్లక్ష్యం వహించిందని, తాము గత తప్పిదాలను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. కేంద్రం ఈ భేటీలో నిష్పక్షపాతంగా వ్యవహరించిందని, మంత్రి సీఆర్ పాటిల్ జడ్జి పాత్ర పోషించారని తెలిపారు. ఈ సమావేశం జల వివాదాలకు శాశ్వత పరిష్కారం వైపు ఒక అడుగుగా నిలిచింది, కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఇరు రాష్ట్రాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.