రాహుల్ హామీలను ఎవరూ నమ్మరు: అమిత్ షా

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు జిహాద్‌కి, అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికలంటూ అమిత్ షా సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం భువనగిరి చేరుకున్న అమిత్ షా.. స్థానిక బీజేపీ అభ్యర్థి అయిన బూర నర్సయ్యకు మద్దతుగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇవి రాహుల్ గాంధీకి, నరేంద్ర మోదీకి మధ్య జరుగుతున్న ఎన్నికలు.. జిహాద్‌కు, అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికలు.. కుటుంబాన్ని అభివృద్ధి చేసుకునే పార్టీకి, దేశాభివృద్ధి కోసం అహర్శిశలు కష్టపడుతున్న పార్టీకి మధ్య జరుగుతున్న ఎన్నికలు. మరి ఎవరికి ఓటు వేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలి’’ అని అన్నారు. అనంతరం రాహుల్ గాంధీపై విమర్శల వర్షం కురిపించిన అమిత్ షా.. రాహుల్ గాంధీవి పిల్ల చేష్టలని, ఆయన గ్యారంటీలను ఎవరూ నమ్మరని ఎద్దేవా చేశారు.
అంతేకాకుండా మొదటి 3 విడతల్లోనే బీజేపీ 200 సీట్లు వరకు గెలిచేసిందని ధీమా వ్యక్తం చేసిన అమిత్ షా.. తెలంగాణలో బీజేపీ 10 కంటే ఎక్కువ స్థానాలు గెలవబోతోందంటూ జోస్యం చెప్పారు. దేశవ్యాప్తంగా ఈ దఫా బీజేపీ 400 సీట్లు సాధించబోతోందన్నారు. అనంతరం కాంగ్రెస్-బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలపై ఫైర్ అయిన అమిత్ షా.. ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల మధ్య ట్రయాంగిల్ బంధం నడుస్తోంది. ఈ 3 పార్టీలు కలిసి రామనవమి ఊరేగింపు జరగకుండా అడ్డుకుంటాయి. సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం కూడా జరుపుకోకుండా అడ్డుకుంటాయి. తెలంగాణలో షరియా, ఖురాన్ ఆధారిత పాలన సాగించాలనేదే ఈ పార్టీల ఆలోచనంతా’’ అని ఆరోపించారు. అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.