ఆక్సిజన్ అందక 24 మంది మృత్యువాత?

దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతంగా సాగుతోంది. దీనికి తోడు ఆక్సిజన్ కొరత తీవ్రంగానే వేధిస్తోంది. మొన్నటికి మొన్న ఆక్సిజన్ అందక ఢిల్లీ ఆస్పత్రిలో కరోనా రోగులు మరణించారు. తాజాగా కర్ణాటకలోనూ ఇదే విషాదం జరిగింది. చామరాజనగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 24 మంది చనిపోయారు. వీరంతా ఆక్సిజన్ సపోర్టుపై ఉన్నవారే. ఆక్సిజన్ అందకే వారందరూ చనిపోయారని కుటుంబీకులు పేర్కొంటున్నారు. అయితే అధికారులు మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. తమ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతే లేదని, మైసూరు నుంచి ఆక్సిజన్ తెప్పిచ్చామని బదులిచ్చారు. పోస్టుమార్టం రాగానే వీరి మృతికి కారణాలు తెలుస్తాయని పేర్కొంటున్నారు. వారందరికీ ఇతర వ్యాధులు కూడా ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి యడియూరప్ప చామరాజనగర్ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. జరిగిన సంఘటన గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు.