India-Pakistan: ఇండస్ వాటర్ ట్రీటీ అంటే..?

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడి (Pahalgam terror attack) నేపథ్యంలో దాయాది పాకిస్థాన్‌తో దౌత్య సంబంధాలపై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ పాక్‌తో సింధూ నదీ జలాల ఒప్పందం (Indus Waters Treaty) అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఈ సింధూ నదీ జలాల ఒప్పందం అంటే ఏంటి..? అది పాకిస్తాన్ కు ఎలా వరప్రసాదంలా మారింది..?
సింధు, దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి ప్రపంచబ్యాంకు మధ్యవర్తిత్వంతో భారత్ (India), పాకిస్థాన్‌ల మధ్య ఒప్పందం కుదిరింది. దీనిపై 1960 సెప్టెంబరులో నాటి భారత ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ, పాకిస్థాన్ (Pakistan) అధ్యక్షుడు అయూబ్‌ఖాన్ సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారతదేశానికి హక్కులు లభించాయి. వీటి సగటు వార్షిక ప్రవాహం 33 మిలియన్ ఎకరాల అడుగులు (ఎమ్‌ఏఎఫ్)గా ఉంది. సింధు నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్థాన్‌కు హక్కులు దక్కాయి. వీటి సామర్థ్యం 135 ఎమ్‌ఏఎఫ్‌గా ఉంది. ఈ నదీ జలాల వినియోగ సమాచారాన్ని పంచుకోవడానికి ఒప్పందం కింద ఓ సహకార యంత్రాంగాన్ని నెలకొల్పారు.
సింధు, దాని ఉపనదుల జలాలను భారత్, పాక్‌లు పరస్పర స్నేహ, సహకార, సుహృద్భావాలతో పంచుకోవాలని ఒప్పందం నిర్దేశిస్తోంది. పశ్చిమ నదుల జలాలలో భారత్ వాటాను సేద్యానికి పరిమితంగా.. జలవిద్యుత్ ఉత్పత్తి, జల రవాణా, చేపల వేటకు గరిష్ఠంగా ఉపయోగించుకోవచ్చు. ఈ విషయంలో రెండు దేశాల మధ్య సహకారం కొనసాగేందుకు ‘శాశ్వత సింధు కమిషన్ (పీఐసీ)’ను ఏర్పాటుచేశారు. దీనికి రెండు దేశాల నుంచి కమిషనర్లు బాధ్యులుగా ఉన్నారు. ఒప్పందం అమలు గురించి ఏటా సమావేశాలు జరుగుతాయి.
గత ఆరు దశాబ్దాల్లో భారత్, పాక్‌ల మధ్య యుద్ధాలు జరిగినా, పలుమార్లు ఉద్రిక్తతలు నెలకొన్నా సింధు జలాల ఒప్పందం అమలుకు అవేవీ అడ్డురాలేదు. కానీ, ఇటీవల కాలంలో డ్యామ్‌ల నిర్మాణం, నీటి వినియోగం, ఒప్పంద నిబంధనల అమలుకు సంబంధించి వివాదాలు తలెత్తాయి. ముఖ్యంగా పశ్చిమ నదులైన జీలం, చినాబ్‌లపై జమ్మూకశ్మీర్‌లో నిర్మితమవుతున్న జల విద్యుత్కేంద్రాలపై పాకిస్థాన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేస్తోంది. కానీ, ఒప్పందం ప్రకారం ఈ ఉపనదుల జలాలను భారత్ సాగు కోసం పరిమితంగా, జలవిద్యుత్ కోసం గరిష్ఠంగా ఉపయోగించుకోవచ్చు. అయినా కిషన్‌గంగ, రాట్లే ప్రాజెక్టులపై పాకిస్థాన్ వివాదం లేవనెత్తి, మధ్యవర్తిత్వ కోర్టును ఏర్పాటుచేయాల్సిందిగా ప్రపంచబ్యాంకును కోరింది. ఏ వివాదాన్ని పరిష్కరించుకోవాలన్నా తటస్థ నిపుణుడిని నియమించాలని ఒప్పందం నిర్దేశిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ప్రపంచ బ్యాంకు ఓ తటస్థ నిపుణుడిని నియమించింది.
సవరణలకు భారత్ డిమాండ్..
సింధు నదీ జలాల పంపిణీ ఒప్పంద నియమనిబంధనలపై పునఃసమీక్ష జరపాల్సి ఉందని భారత్ కొంతకాలంగా డిమాండ్ చేస్తోంది. 1960లో ఒప్పందం కుదిరిన నాటికీ, ఇప్పటికీ రెండు దేశాల జనాభాలో, తాగు, సాగు నీటి అవసరాలలో చాలా మార్పులు వచ్చాయనీ, పర్యావరణ, భౌగోళిక, రాజకీయపరంగా కూడా మార్పులు చోటుచేసుకున్నాయని గుర్తుచేసింది. వాటిని పరిగణనలోకి తీసుకొని ఒప్పందాన్ని సమీక్షించాల్సి ఉందని భారత్ స్పష్టంచేసింది. అయితే, దీనిపై పాక్ మాత్రం వ్యతిరేకత వ్యక్తంచేస్తూ వస్తోంది. ఈ పరిణామాల వేళ తాజాగా పహల్గాం దాడితో ఈ ఒప్పందం అమలును భారత్ నిలిపివేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది.