US visa :వచ్చే ఏడాది నుంచి అమెరికా వీసా.. మరింత భారం

ఉద్యోగ (హెచ్-1బీ), విద్యార్థి (ఎఫ్-ఎం), పర్యాటక/వ్యాపార (బీ-1- బీ2), ఎక్స్చేంజ్ (జే) వీసాలపై అమెరికా వెళ్లేవారిపై వచ్చే ఏడాది నుంచి మరింత భారం పడనుంది.ఈ వీసాలతో తమ గడ్డపై అడుగుపెట్టాలనుకునే వారి నుంచి ఇంటెగ్రిటీ ఫీ కింద అదనంగా 250 డాలర్ల రుసుము (మన కరెన్సీలో దాదాపుగా రూ.21,500) వసూలు చేయాలని అమెరికా సర్కారు (US government) నిర్ణయించింది. నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా (Non-immigrant visa )లపై అమెరికాకు వచ్చేవారు అక్రమంగా ఉండిపోకుండా, వీసా కాలానికి మించి ఉండకుండా చూసేందుకే ఈ నిర్ణయం తీసుకుంది.
ఇటీవలే ఆమోదించిన వన్ బిగ్ బ్యూటిఫుల్ యాక్ట్ (Big Beautiful Act ) కింద ఈ పెంపు వచ్చే ఏడాది నుంచి అమలు కానుంది. వీసా జారీ చేసేటప్పుడే అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఈ రుసుమును సర్‌చార్జ్ రూపంలో వసూలు చేస్తుంది. ఐ-94 సర్‌చార్జ్ (24 డాలర్లు), ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఫర్ ట్రావెల్ ఆథరైజేషన్ (ఈఎస్‌టీఏ- 13 డాలర్లు) ఎలక్ట్రానిక్ వీసా అప్‌డేట్ సిస్టమ్ (ఈవీయూఎస్-30 డాలర్లు) కింద అదనపు రుసుములను ఈ బిల్లులో పొందుపరిచారు. అవి కూడా కలుపుకొంటే వీసా రుసుములు భారంగా మారనున్నాయి.