Indian students: అమెరికాకు తగ్గిన భారతీయ విద్యార్థులు

భారతీయ విద్యార్థులు (Indian students) ఈసారి సీజన్ ప్రారంభంలో చాలా తక్కువ సంఖ్యలో అమెరికా వీసా (Visa )లు తీసుకున్నారు. గతేడాది మార్చి-మే మధ్య సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది 27 శాతం వీసాలు తగ్గాయి. కొవిడ్ సీజన్‌లో కన్నా ఇవి తక్కువ కావడం గమనార్హం. అమెరికా విదేశాంగశాఖ డేటా ఈ విషయాన్ని వెల్లడిస్తోంది. ఆగస్టు – సెప్టెంబరు మధ్య సెమిస్టర్ ప్రారంభం కానుండటంతో సాధారణంగా విద్యార్థి వీసాలకు సంబంధించి మార్చి-జులై మధ్య బిజీగా ఉంటుంది. కానీ ఈ ఏడాది మార్చి-మే మధ్యలో భారతీయ విద్యార్థులకు కేవలం 9,906 ఎఫ్-1 వీసాలే జారీ అయ్యాయి. కొవిడ్ తర్వాత ప్రయాణాలు పున ప్రారంభించిన 2022లో ఇదే సీజన్‌లో 10,894గా నమోదయ్యాయి. ఇక 2023లో 14,987, 2024లో 13,478 జారీ అయ్యాయి.
అంతర్జాతీయ విద్యార్థులపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కార్యవర్గం చర్యలకు ఉపక్రమించడం, పాలస్తీనా మద్దతు ఆందోళనల్లో పాల్గొన్న పలువురు విద్యార్థుల వీసాలను రద్దు చేయడం వంటి చర్యలు విద్యార్థులను ఆలోచింపజేస్తున్నాయి. దీనికితోడు మే 27- జూన్ 18 కఠినమైన సోషల్ మీడియా (Social media) వెట్టింగ్ ప్రక్రియ కోసం రెండు వారాలపాటు వీసా దరఖాస్తుల స్వీకరణను నిలిపివేయడం వీసాల సంఖ్య తగ్గడానికి కారణమైంది.