America: ఆపరేషన్ మిడ్ నైట్ హామర్.. ఇరాన్ న్యూక్లియర్ సైట్లపై అమెరికా దాడి

ఇరాన్ -ఇజ్రాయెల్ (Iran – Israel War) వార్ లోకి అమెరికా (America) కూడా ఎంటరైంది. ఇరాన్ లోని మూడు ప్రధాన న్యూక్లియర్ సైట్లపై (Nuclear sites) దాడులు నిర్వహించింది. ఆపరేషన్ మిడ్ నైట్ హామర్ (Operation Midnight hammer) పేరుతో శనివారం రాత్రి ఫోర్డో, నాటాంజ్, ఇస్ఫహాన్ అణు స్థావరాలపై భారీ దాడులు చేసింది. అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ (Donald trump) ఈ దాడిని “స్పెక్టాకులర్ మిలిటరీ సక్సెస్”గా ప్రకటించారు. ఇరాన్ న్యూక్లియర్ స్థావరాలు పూర్తిగా నాశనమయ్యాయని ప్రకటించారు. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలో అమెరికా ప్రత్యక్ష జోక్యం చేసుకోవడంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
అమెరికా సైన్యం అత్యాధునిక సాంకేతికతతో ఈ ఆపరేషన్ చేపట్టింది. ఆపరేషన్ మిడ్‌నైట్ హామర్ లో 125 సైనిక విమానాలు, అందులో ఏడు బీ-2 స్టెల్త్ బాంబర్లు, ఒక యుఎస్ నేవీ సబ్‌మెరైన్ నుంచి 24 కంటే ఎక్కువ టోమాహాక్ క్రూయిజ్ మిసైళ్లు ప్రయోగించినట్లు అమెరికా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ జనరల్ డాన్ కైన్ వెల్లడించారు. ఇది అత్యంత రహస్యంగా నిర్వహించినట్లు తెలిపారు. ఇరాన్ రక్షణ వ్యవస్థలు అమెరికా దాడిని ఎదుర్కోలేకపోయాయి. ఎటువంటి ఫైటర్ జెట్లు లేదా ఉపరితల మిసైళ్లు స్పందించలేదని కైన్ తెలిపారు.
ఫోర్డో యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ ప్లాంట్ లక్ష్యంగా అమెరికా ప్రధానంగా ఈ దాడి చేసింది. ఇది ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్‌కు కీలకమైనది. ట్రంప్ స్వయంగా “ఫోర్దో గాన్” అని ట్వీట్ చేశారు. ఈ సైట్ పూర్తిగా ధ్వంసమైందని ప్రకటించారు. నాటాంజ్, ఇస్ఫహాన్ సైట్లు కూడా గణనీయంగా దెబ్బతిన్నాయని పెంటగాన్ నివేదికలు సూచిస్తున్నాయి. రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ ఈ దాడిని “బోల్డ్ అండ్ బ్రిలియంట్”గా అభివర్ణించారు. ఇరాన్ న్యూక్లియర్ లక్ష్యాలను నిర్మూలించినట్లు చెప్పారు. ఈ ఆపరేషన్ ఇరాన్ సైనికులు లేదా పౌరులను లక్ష్యంగా చేయలేదని, కేవలం న్యూక్లియర్ సౌకర్యాలపైనే దృష్టి సారించిందని హెగ్సెత్ స్పష్టం చేశారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జూన్ 13 నుంచి ఘర్ణ మొదలైంది. ఇజ్రాయెల్ ఇరాన్‌పై ఆకస్మిక దాడులు చేసింది. ఇరాన్ న్యూక్లియర్ సైట్లు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ట్రంప్ ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలు జరిపినప్పటికీ ఇరాన్ దిగిరాలేదు. ఇజ్రాయెల్‌పై బాలిస్టిక్ మిసైళ్లతో ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెట్టింది. దీంతో ట్రంప్ ఆగ్రహించారు. ఇరాన్ న్యూక్లియర్ ఆయుధాలను సమకూర్చుకోవడాన్ని ఎట్టిపరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. ఇందుకోసం సైనిక చర్య అవసరమని నిర్ణయించారు. ఇజ్రాయెలీ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ఈ దాడిని స్వాగతించారు.
అమెరికా దాడులను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. ఇక తన టర్న్ కోసం వేచి చూడాలని హెచ్చరించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి తీవ్రంగా ఖండించారు. ప్రతీకార దాడులు తప్పవని, శాశ్వత పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తమ ముందున్న అన్ని అంశాలను పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ఫోర్డో, ఇతర సైట్లలో రేడియేషన్ కాలుష్యం లేదని పేర్కొంది. ఇరాన్ మీడియా అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని సూచించింది. ఇరాన్ పై అమెరికా దాడులను సౌదీ అరేబియా, ఖతార్ ఖండించాయి. ఇవి ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని చెప్పాయి.