Jair Bolsonaro: బ్రెజిల్ జడ్జి వీసా రద్దు చేసిన అమెరికా

బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో (Jair Bolsonaro) కాలి చీలమండకు ఎలక్ట్రానిక్ పర్యవేక్షక పరికరాన్ని అమర్చి ఆయన కదలికల్ని గమనించాలని ఆ దేశ సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ చర్యల పై అమెరికా (America) దీటుగా స్పందించింది. బోల్సొనారోపై ఆంక్షలు విధించిన బ్రెజిల్ న్యాయమూర్తి వీసా రద్దు చేసింది. అంతకుముందు ట్రంప్ (Trump) స్పందిస్తూ తన మిత్రుడైన బోల్సానారో పట్ల బ్రెజిల్ న్యాయవ్యవస్థ అన్యాయంగా వ్యవహరించిందని పేర్కొన్నారు. మాజీ అధ్యక్షుడు బోల్సొనారోపై బ్రెజిల్ సుప్రీం ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారని అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియో ఆరోపించారు. న్యాయస్థానం చర్యలు బ్రెజిలియన్ల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమే కాకుండా అమెరికాన్లను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నమేనని మండిపడ్డారు. బోల్సొనారోపై ఆంక్షలు విధించిన జడ్జితో పాటు ఆయనకు మద్దతుగా నిలిచిన న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులకు కూడా వీసా ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.