Martin Luther King: మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్‌పై ఎఫ్‌బీఐ పత్రాల విడుదల

అమెరికాలో నల్లజాతి హక్కుల కోసం పోరాడి 1968లో ఒక జాత్యహంకారి తూటాలకు బలైన మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ (Martin Luther King Jr) పై ఆనాడు అమెరికా దర్యాప్తు సంస్థ- ఎఫ్‌బీఐ (FBI) నిఘాకు సంబంధించిన అధికారిక రికార్డులను డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యంత్రాంగం ప్రజా పరిశీలన కోసం బహిరంగపరచింది. సుమారు 2.4 లక్షలకు పైగా పేజీలు కలిగిన ఈ సమాచారాన్ని 1977 నుంచి కోర్టు ఆదేశాల మేరకు గోప్యంగా ఉంచారు. ఎఫ్‌బీఐ సేకరించిన ఈ పత్రాలను ఆనాటి నుంచీ జాతీయ ప్రాచీనపత్ర భాండాగారంలో భద్రపరిచారు. ప్రభుత్వ చర్యపై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ పిల్లలైన మార్టిన్-3, బెర్నిస్ సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. బహిర్గతం చేసిన ఈ సమాచారాన్ని అప్పటి పరిస్థితులకు అన్వయించుకోవాలని వారు పిలుపునిచ్చారు. డాక్టర్ కింగ్ (Dr. King) హత్య మాకెంతో వ్యక్తిగత వ్యథకు కారణమైంది. 57 ఏళ్లుగా ఆ శూన్యత అనుభవిస్తున్నాం. ఆయనకు సంబంధించిన రహస్య పత్రాలు విడుదల చేస్తున్నవారు సహానుభూతితో, గౌరవంతో ఆ పనిచేయాలి. మా కుటుంబ వ్యథను గౌరవించాల్సిందిగా అభ్యర్థిస్తున్నాం అని పేర్కొన్నారు. రహస్య పత్రాల విడుదల ఒక అపూర్వ ఘట్టమని అమెరికా జాతీయ నిఘా విభాగా డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard ) పేర్కొన్నారు.