Trump: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధరంగంలోకి అమెరికా ప్రవేశం..

అగ్రరాజ్యం అమెరికా (America) అత్యంత వేగంగా నిర్ణయం తీసుకుంది. ఈ యుద్ధంలోకి అడుగు పెట్టే విషయమై 15 రోజుల్లో ఆలోచిస్తామన్న అమెరికా.. కేవలం రెండురోజుల్లోనే యుద్ధక్షేత్రంలోకి తన యుద్ధవిమానాలను పంపించింది. ముఖ్యంగా అత్యంత కీలకమైన అణుకేంద్రాలపై.. క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. ఇరాన్ (Iran) భూతలం నుంచే బయలుదేరిన బాంబర్లు, క్షిపణులు… నేరుగా ఇరాన్ లోని లక్ష్యాలను చేదించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు. తమ పనిని విజయవంతంగా అమెరికా ఆర్మీ పూర్తి చేసిందని.. ఇక శాంతి ప్రక్రియ మాత్రమే మిగిలి ఉందన్నారు ట్రంప్.
ఇరాన్ పై దాడులకు బీ-2 స్టెల్త్ బాంబర్లను వాడినట్లు వెల్లడించారు ట్రంప్. ఇస్ఫహాన్, నతాంజ్‌పై తమ సబ్‌మెరైన్ దాదాపు 400 మైళ్ల దూరం నుంచి 30 తోమహాక్ క్షిపణులను ప్రయోగించినట్లు తెలిపారు. అయితే.. ఆరు బీ-2 స్టెల్త్ బాంబర్లు 12 బంకర్ బస్టర్లను ప్రయోగించినట్లు అమెరికా పత్రిక సీఎన్‌ఎన్ రక్షణశాఖ అధికారులను ఉటంకిస్తూ పేర్కొంది. వీటిల్లో రెండు బంకర్ బస్టర్లను నతాంజ్ అణు శుద్ధి కేంద్రంపై కూడా వాడినట్లు వెల్లడించింది.
వాస్తవానికి ఫోర్డోపై తొలుత ఒక్కోటి 13,600కిలోల బరువుండే రెండు జీబీయూ-57 బంకర్ బస్టర్లు సరిపోతాయని అధికారులు అంచనా వేశారు. కానీ, ఈ ఆపరేషన్‌లో ఏకంగా ఆరింటిని ప్రయోగించారు.20 అడుగుల పొడవుండే ఈ బాంబులు పర్వతాలను చీల్చుకొంటూ 61 మీటర్ల కిందకు చొచ్చుకుపోయి పేలతాయి. ఈ బాంబు బరువులో సుమారు 80 శాతం అత్యంత పటిష్ఠమైన లోహ సమ్మేళనాలతో చేసిన కేసింగ్ ఉంటుంది. దాదాపు 13.5 టన్నులున్న ఈ బాంబులో రెండు టన్నుల పైచిలుకు మాత్రమే విస్ఫోటకాలు ఉంటాయి. విధ్వంసం మొత్తం కేసింగే చేస్తుంది. ఒక్కో బాంబు ఖరీదు 20 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. 2015లో అమెరికా వాయుసేన ఇలాంటివి 20 బాంబుల తయారీకి బోయింగ్‌కు కాంట్రాక్ట్ ఇచ్చినట్లు సీబీసీ న్యూస్ పేర్కొంది.
వాస్తవానికి ఫోర్డో అణు శుద్ధి కేంద్రాన్ని ఇరాన్ అత్యంత రహస్యంగా ఉంచింది. పర్వతం కింద సుమారు 300 అడుగుల లోతులో దీనిని నిర్మించింది. మళ్లీ అక్కడి నుంచి ఎంత లోతులో యురేనియాన్ని శుద్ధి చేసే సెంట్రిఫ్యూజ్‌లు ఉన్న హాల్ ఉందో తెలియదు. ఈ కేంద్రానికి అనేక విమాన విధ్వంసక బ్యాటరీలు రక్షణ కల్పిస్తున్నాయి.
ఇక అమెరికా ప్రయోగించిన బాంబు పర్వతంపై పడినా.. కచ్చితంగా అణుకేంద్రం వరకు చేరుతుందో లేదో చెప్పలేని పరిస్థితి. దీంతో తొలుత ఒక బంకర్ బస్టర్ ప్రయోగించి కొంత లోతు వరకు ధ్వంసం చేస్తారు. మళ్లీ అక్కడే మరో బంకర్ బస్టర్‌ను ప్రయోగించి మరికొంత లోతులో ఉన్న నిర్మాణాలను పేల్చేసేలా అమెరికా ప్లాన్ చేసుకొంది.
వాస్తవానికి ఈ బాంబులను ప్రయోగించడానికి వీలుగా 2007లో 200 మిలియన్ డాలర్లు వెచ్చించి బీ-2 స్పిరిట్ ఫైటర్ బాంబర్లలో అమెరికా మార్పులు చేసింది. 1999 కొసావో యుద్ధంలో అమెరికా తొలిసారి ఈ విమానాలను వినియోగించింది. బీ-2 స్టెల్త్ ఒక్కో విమానం ఖరీదు దాదాపు 2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.17,000 కోట్లు) ఉంటుంది. ఒక్కో బీ-2 స్పిరిట్ అత్యధికంగా రెండు వరకు బంకర్ బస్టర్లను మోసుకెళ్లగలదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.