UN: ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా-చైనా విమర్శల హోరు…

అమెరికా- చైనా (USA-China)ల మధ్య వాణిజ్యయుద్ధం తార స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే పరస్పర సుంకాలతో ప్రతీకార చర్యలకు దిగిన ఇరు దేశాలు తాజాగా.. ఐక్యరాజ్య సమితి వేదిక మీద విమర్శ, ప్రతివిమర్శలతో విరుచుకుపడ్డాయి. అమెరికా సుంకాల ధోరణి బెదిరింపులతో కూడినదిగా ఉందని చైనా విమర్శించగా.. అమెరికా బీజింగ్‌కి గట్టి కౌంటర్ ఇచ్చింది.
బుధవారం ఐక్యరాజ్యసమితిలో భద్రతా మండలి సమావేశం నిర్వహించారు. ఇందులో చైనా తరఫు (China) రాయబారి ఫు కాంగ్ (Fu Cong) మాట్లాడుతూ యూఎస్ విధించిన సుంకాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నేతృత్వంలోని ప్రభుత్వం తమ వాణిజ్య భాగస్వాములపై సుంకాలు విధించి ప్రపంచ ఆర్థికవ్యవస్థకు విఘాతం కలిగించింది. పరస్పరం అనే ముసుగులో యూఎస్ టారిఫ్‌ల ఆట ఆడుతోంది. ఇతర దేశాలకు నష్టం కలిగించి.. తమ సొంత ప్రయోజనాలను అభివృద్ధి చేసుకోవాలని చూస్తోంది. ఈ చర్య ఇప్పటికే అంతర్జాతీయ ఆర్థిక, వాణిజ్యక్రమాన్ని దెబ్బతీస్తోంది. మేము అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండాలా, లేక ఇలాంటి అర్థం లేని చట్టాలను పాటించాలా. మాపై భారీ స్థాయిలో సుంకాలు విధించడం బెదిరింపులతో కూడినదిగా ఉంది. ఇలా మాపై ఒత్తిడి పెంచడం సరైన చర్య కాదు’ అని ఫు కాంగ్ పేర్కొన్నారు.
ఇక, ఈ వ్యాఖ్యలకు అమెరికా (USA) మిషన్ ప్రతినిధి టింగ్ వు (Ting Wu) గట్టిగా బుదులిచ్చారు. చైనా విశ్వసనీయత లేని వ్యాఖ్యలు చేస్తోందన్నారు. ప్రపంచం చైనా వాదనలు వినకుండా.. ఆ దేశం చేస్తున్న చర్యలను చూడాలని ఎద్దేవా చేశారు. చాలాకాలంగా బీజింగ్ ఏకపక్షమైన, అన్యాయమైన వాణిజ్య పద్ధతులను అనుసరించిందన్నారు.