E VISA : బ్రిటన్‌లో రేపటి నుంచి ఈ వీసా అమలు

యునైటెడ్ కింగ్‌డమ్(యూకే)లో ఈ నెల 15 నుంచి సాధారణ వీసాల స్థానంలో ఈ-వీసాలు అమల్లోకి వస్తాయి. వీసాల జారీ ప్రక్రియలో యూకే ఇమిగ్రేషన్ చేపట్టిన మార్పుల్లో భాగంగా ఈ-వీసా(E VISA) లను పరిచయం చేస్తారు. ఈ నెల 15 నుంచి అన్నిరకాల వీసాలు పొందేవారి పాస్‌పోర్టు (Passport) లతో ఈ-వీసాలు లింక్ అయ్యి డిజిటల్ రూపంలో కొనసాగుతాయి. బ్రిటన్ (Britain) తన వలస విధానంలో భాగంగా ఈ ఏడాది మే నెలలో రీస్టోరింగ్ కంట్రోల్ ఓవర్ ఇమిగ్రేషన్ సిస్టమ్ పేరుతో శ్వేతపత్రాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ విధానంలో భాగంగా ఈ నెల 15 నుంచి దశల వారీగా వీసా విధానంలో కీలక మార్పులు అమల్లోకి వస్తాయి. ఇమిగ్రేషన్ ప్రక్రియను గాడిన పెట్టేందుకు ఈ విధానాన్ని తీసుకువస్తున్నట్లు అధికారులు వివరించారు. భారత్ (India) నుంచి విద్యార్థులే ఎక్కువ సంఖ్యలో యూకే వీసాలు తీసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు (Students) కచ్చితంగా తమ డిజిటల్, ప్రొసీజరల్ అంశాలను ప్రయాణానికి ముందే సరిచూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇకపై వీసా విగ్నైట్‌ను జారీ చేయరని, దాని బదులు ఈ-వీసా జారీ అవుతుందని పేర్కొన్నారు.