Tianjin: ఎక్కడైనా ఇంతే.. షాంఘై సదస్సులో పాక్ ప్రధానికి ఇబ్బందికర పరిణామం..

పాకిస్తాన్ (Pakistan) నాయకత్వానికి అంతర్జాతీయ వేదికలపై విలువుండదా..? ఏదో తమ మానాన తాము వెళ్లి, కావాల్సింది అడిగి తెచ్చుకోవడమేనా…? ఇటీవలి కాలంలో పాక్ నేతల్లో వ్యక్తమైన ఆవేదన.. షాంఘై సదస్సు వేదికగా మరోసారి నిరూపితమైంది. మిత్రదేశమైన చైనాలో పర్యటిస్తున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు.. తీవ్ర ఇబ్బందికర పరిణామం ఎదురైంది. ఓ కీలక సదస్సులో పాక్ ప్రధాని నిశ్చేష్టుడై నిలబడడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
షాంఘై సహకార సంస్థ’ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సుకు పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ హాజరయ్యారు. అధినేతలు హాజరైన సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా, వారు తనను పట్టించుకోకపోవడంతో షరీఫ్ ఒంటరిగా నిలబడిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి.
టియాన్ జెన్‌లో జరుగుతున్న ఎస్‌సీఓ సదస్సులో సభ్యదేశాల అధినేతలు గ్రూప్ ఫొటో దిగేందుకు ఒక చోటకు వస్తున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. ప్రధాని మోడీ, అధ్యక్షుడు పుతిన్ ఇద్దరూ ఏదో విషయంపై తీవ్రంగా చర్చిస్తూ ముందుకు సాగారు. అదే సమయంలో పక్కనే నిల్చున్న పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వారిని చూస్తూ ఉండిపోయారు. ఇద్దరు అగ్రనేతలు తనను పలకరించకుండా వెళ్లడంతో ఆయన ముఖంలో నిరాశ స్పష్టంగా కనిపించింది.
ఈ ఘటనకు కొద్దిసేపటి ముందే ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కలిసి నవ్వుతూ మాట్లాడుతున్న ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ముగ్గురు నేతలు ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకోవడం కనిపించింది. ఈ ఫొటోలను ప్రధాని మోదీ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పంచుకున్నారు.
ఇటీవల పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ఈ దాడికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. ఈ తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఎస్‌సీఓ సదస్సులో పాక్ ప్రధానిని మోడీ, పుతిన్ పలకరించకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.