Suryapet :అమెరికాలో కుక్క కరిచింది.. 15.73 లక్షల పరిహారం అందింది

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం శోభనాద్రిగూడేనికి చెందిన వెలమకన్ని కిశోర్ (Kishore) అనే వ్యక్తికి అమెరికాలో 15 ఏళ్ల తరువాత న్యాయం లభించింది. ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన ఆయన, 2010లో రోడ్ ఐలాండ్ (Rhode Island )లో అద్దె ఇంటి కోసం కార్లా అనే ఆమె ఇంటికి వెళ్లగా, వారి పెంపుడు కుక్క (Dog) కిశోర్‌పై దాడి చేసి కరిచింది. వైద్య ఖర్చులకు 600 డాలర్లు ఇస్తానని కార్లా చెప్పింది. అనంతరం ఆ మొత్తం ఇవ్వకుండా దుర్భాషలాడింది. దీంతో కిశోర్ వాషింగ్టన్ డీసీలో కోర్టు (Court)ను ఆశ్రయించారు. వాదనల అనంతరం ఆయనకు అనుకూలంగా అదే ఏడాది కోర్టు తీర్పు వెలువరించింది. వైద్య, న్యాయ ఖర్చులు, పరిహారం, వడ్డీ కలిపి 10,359 డాలర్లు బాధితుడికి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. అయితే కార్లా ఐపీ పెట్టడం, ఇల్లు తనఖాలో ఉండటంతో పరిహారం రాలేదు. ఇటీవల కార్లా ఇంటిని అమ్మగా కోర్టు ఆదేశాల మేరకు కొనుగోలుదారు నుంచి ఆ పరిహారం మొత్తం వడ్డీతో కలిపి 29,092.91 డాలర్లు వచ్చాయని కిశోర్ తెలిపారు. లాయర్ ఫీజులు, ఇతర ఖర్చులు పోనూ తన ఖాతాలో 18,429.83 డాలర్లు (రూ.15.73 లక్షలు) గత నెల 25న జమయ్యాయని కిశోర్ వెల్లడించారు. ప్రస్తుతం తాను కెనడాలో నివాసం ఉంటున్నానని, అమెరికాలో తనకు న్యాయం జరిగిన తీరు అక్కడి న్యాయ వ్యవస్థ పటిష్ఠతకు అద్దం పడుతుందని చెప్పారు.