Shubhaman Gill: వన్డేలకు కూడా గిల్..? బీసీసిఐ కీలక నిర్ణయం

భారత క్రికెట్‌లో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న తర్వాత.. జట్టులో కీలక మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయి. టెస్ట్ క్రికెట్ నుంచి రోహిత్ శర్మ తప్పుకున్న తర్వాత అతని స్థానంలో శుభమన్ గిల్ ను కెప్టెన్ గా ఎంపిక చేసారు. ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్ మీద దృష్టి సారించింది బోర్డ్. మూడు ఫార్మాట్ లకు శుభమన్ గిల్ ను కెప్టెన్ గా ఎంపిక చేయాలని బోర్డు పెద్దలు భావిస్తున్నట్టు జాతీయ మీడియాలో ఓ కథనం వెలువడింది.
వన్డే క్రికెట్ లో రోహిత్ శర్మ కొనసాగినా సరే కెప్టెన్ గా మాత్రం గిల్ ను నియమించే దిశగా అడుగులు వేస్తోంది. ఇంగ్లాండ్ పర్యటనలో గిల్ ఆకట్టుకుంటున్నాడు. కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత అతని బ్యాటింగ్ లో మరింత పదును కనపడుతోంది. రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీతో ఇంగ్లాండ్ లో ఎవరూ ఊహించని ప్రదర్శన చేసాడు గిల్. కెప్టెన్ గా కూడా రెండో టెస్ట్ లో అతనిలో పరిణితి కనపడింది. దీనితో వచ్చే వరల్డ్ కప్ ను దృష్టిలో పెట్టుకుని శుభమన్ గిల్ ను పూర్తి స్థాయి కెప్టెన్ గా నియమించాలని బోర్డ్ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.
వన్డేలకు ముందు కెఎల్ రాహుల్ పేరును పరిశీలించిన బోర్డ్ పెద్దలు.. గిల్ ప్రదర్శన ఆకట్టుకోవడంతో అతని వైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. జట్టులోని ఆటగాళ్లతో, హెడ్ కోచ్ గంభీర్ తో మాట్లాడిన తర్వాత నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు టెస్ట్ వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ పేరు కూడా పరిశీలిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. రెండేళ్ళ క్రితం జరిగిన వన్డే ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ కెప్టెన్సిపై ప్రశంశలు దక్కాయి. ఫైనల్ లో ఓటమి మినహా ఆ టోర్నీలో సారధ్య బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాడు. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా రోహిత్ ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకున్న బోర్డు.. గిల్ ను ఎంపిక చేసే దిశగా అడుగులు వేస్తోంది.