Shubhanshu Shukla: భూమిపై దిగిన శుభాంశు శుక్లా ..యాక్సియం-4 విజయవంతం

యాక్సియం-4 మిషన్ ప్రయోగం విజయవంతమైంది. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) బృందం సురక్షితంగా భూమికి చేరుకుంది. రోదసీలో 18 రోజులు గడిపి, మానవాళికి ప్రయోజనం కలిగించే అనేక ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించిన ఈ బృందం మంగళవారం మధ్యాహ్నం 3.01కి కాలిఫోర్నియా (California) సముద్ర తీరంలో దిగింది. భూమికి తిరిగి రావడం సంతోషంగా ఉందని యాక్సియం -4 కమాండర్ పెగ్గీ విట్సన్ (Peggy Whitson) పేర్కొన్నారు.
యాక్సియం-4 మిషన్ విజయవంతం కావడంపై భారతీయుల్లో ఆనందం వ్యక్తమైంది. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లాతో పాటు ఆయన బృందం సురక్షితంగా తిరిగి రావడంపై తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. స్వస్థలం లఖ్‌నవూ (Lucknow)లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.