China: అందరి చూపు తియాన్ జిన్ పైనే.. ఒకే వేదికపైకి జిన్ పింగ్, మోడీ, పుతిన్..!

అమెరికా అగ్రరాజ్యాధిపత్యానికి గట్టి ఎదురుదెబ్బ తగలనుందా..? ఆమూడుదేశాలే అమెరికా(USA)ను పక్కన పెట్టేసేందుకు ప్రయత్నాలు మొదలెడుతున్నాయా..? పరస్పరం పడని చైనా, భారత్ లను కలిపించి ఆ అగ్రపెత్తనమేనా..? వీటన్నింటికి రేపు తియాన్ జిన్ వేదికగా జరిగే షాంఘై సహకార సంస్థ సమావేశం బదులివ్వనుంది. ఎందుకంటే.. ప్రస్తుతం ప్రపంచంలో ఫేమస్ లీడర్లుగా ఉన్న పుతిన్, మోడీ, జిన్ పింగ్ కలిసి ఒకే వేదికపై కనిపించనున్నారు. ఈ సమావేశం ప్రపంచపు గమనాన్ని మార్చేస్తుందన్న వాదనలున్నాయి.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Modi), రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin), చైనా అధినేత షీ జిన్‌పింగ్(Jinping)లు యూరప్-ఆసియా (యూరేసియా) బంధానికీ, పెరుగుతున్న ఆసియా ప్రాధాన్యానికీ నిదర్శనంగా నిలుస్తున్నారు. వర్ధమాన దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిక్స్‌తోపాటు పలు ఇతర సంస్థలకూ వెన్నుదన్నుగా ఉంటున్నారు. ఏదో ఒక్క దేశమే ఆధిపత్యం చలాయించే రోజులు పోయాయనీ, రాబోయేది బహుళ ధ్రువ ప్రపంచమేనని వారు తియాన్‌జిన్ వేదికగా చాటి చెప్పనున్నారు. ముగ్గురు అధినేతల సమావేశాన్ని సఫలీకృతం చేయాలని చైనా గట్టి పట్టుదలతో ఉంది.
రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 80 ఏళ్లు పూర్తయింది. 1945 సెప్టెంబరులో ఫాసిస్టులపై సమరం సఫలమై జపాన్ లొంగిపోయింది. ఈ విజయాలను పురస్కరించుకుని సెప్టెంబరు 3వ తేదీన చైనా కవాతు నిర్వహించనుంది. ఇలాంటివేళ జరుగుతున్న ఎస్‌సీవో సమావేశం అదనపు ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎస్‌సీవో సమావేశానికి వచ్చే 20 మంది ప్రపంచ నాయకులు కవాతుకు హాజరవనున్నారు. ఎస్‌సీవో భేటీలో పుతిన్ పాల్గొనడం వర్ధమాన దేశాలకు గొప్ప ఊతమిస్తుంది. ఇటీవల అలాస్కా శిఖరాగ్ర సభలో ట్రంప్‌తో చర్చలు జరిపి వచ్చిన వెంటనే పుతిన్ ఎస్‌సీవో సమావేశంలో పాల్గొంటున్నారు. ఇది యూరోపియన్ యూనియన్స తీవ్రంగా పరిగణించాల్సిన అంశంగా చెప్పవచ్చు.
ట్రంప్ భారత్‌కు సుంకాలతో షాక్ ఇచ్చిన దరిమిలా అమెరికాయేతర ప్రపంచదేశాలపై మోడీ సర్కార్ ఫోకస్ పెట్టింది. అమెరికాను ఇప్పటికీ తమ వ్యూహాత్మక భాగస్వామిగా పరిగణిస్తున్నా, అగ్రరాజ్యం చెప్పిన ప్రతిదానికీ తలూపబోమనీ, తమకూ ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే సందేశాన్ని మోడీ అందించే అవకాశముంది. ట్రంప్ సుంకాల మోత వల్ల భారత్ చైనా వైపు మరలనుందనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది. అమెరికా నమ్మదగిన నేస్తం కాదని నిరూపితమైన దృష్ట్యా బలీయమైన ఇతర దేశాలతో ఆర్థిక, వాణిజ్య పొత్తు నెరపడం మంచిదని ఇండియా గ్రహించింది. అందులో భాగంగానే చైనాతో వాణిజ్యాన్ని విస్తరించే కృషి జరుగుతోంది. అదే సమయంలో వ్యూహపరంగా భారత్ తన స్వయం నిర్ణయాధికారాన్ని నిలబెట్టుకుంటుంది.
బ్రిక్స్ తరహాలో ఎస్‌సీవోను కూడా వాణిజ్య వేదికగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎస్‌సీవోను ఉగ్రవాదాన్ని వ్యతిరేకించే భద్రతాపరమైన సంఘంగా ప్రారంభించారు. ఈసారి సమావేశంలో ఎస్‌సీవో ఉగ్రవాదాన్ని తీవ్రంగా ఖండించాలని భారత్ పట్టుపడుతోంది. పహల్గాంలో పాక్ ప్రేరిత ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టినందువల్ల ఎస్‌సీవో సభ్యులు ఉగ్రవాదాన్ని ఖండించాలని భారత్ డిమాండ్ చేయనుంది.
యూరేసియా భద్రతా ఒడంబడికపై చర్చకు రష్యా శ్రీకారం చుట్టనుంది. ఎస్‌సీవోలో సౌదీ అరేబియా చేరే విషయంపైనా చర్చ జరుగుతుంది. ఎస్‌సీవో, బ్రిక్స్ వేదికలు విజయవంతం కావాలన్నా, బహుళ ధ్రువ ప్రపంచం వైపు సాగాలన్నా భారత్-చైనా సంబంధాలు సాధారణ స్థితికి రావడం ముఖ్యం. ఆ దిశగా కృషి మొదలైనా అది ఫలించడానికి మరికొంత సమయం పడుతుంది. 2024లో రష్యాలో బ్రిక్స్ సభ జరిగినప్పుడు మోదీ, జిన్‌పింగ్‌లు విడిగా సమావేశమై ఈ ప్రక్రియకు నాంది పలికారు.