Fordo Nuke Site: ఫోర్డో అణుకేంద్రం ధ్వంసమైనట్లేనా..? లేదా ఇరాన్ సేఫ్ ప్లేస్ లోకి సర్దేశిందా..?

అమెరికా (America) బాంబర్ల దాడిలో ఫోర్డో అణుకేంద్రం ధ్వంసమైందా..? అణుకేంద్రం ధ్వంసమైందని అమెరికా భావిస్తోందా..? ట్రంప్ (Trump) ప్రకటన వెనక అర్థమేంటి..? ఐఏఈఏ నిపుణులు ఏమంటున్నారు..? అమెరికా అధ్యక్షుడు చెబుతున్నట్లు దాడులైతే కచ్చితంగా జరిగాయి. కానీ.. అక్కడి పరిణామాలు చూస్తుంటే.. ముందే ఇరాన్ తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా దాడులు చేసే సమయానికి.. ఫోర్డో అణు కేంద్రం నుంచి కీలక పరికరాలు, యురేనియాన్ని ఇరాన్ తరలించేసినట్లు అనుమానిస్తున్నారు.
జూన్ 19-20 రాత్రి ఉపగ్రహ చిత్రాల్లో ఇక్కడ భారీ సంఖ్యలో ట్రక్కులు ఇతర వాహనాలు బారులు తీరి కనిపించాయి. జూన్ 19న 16 కార్గో ట్రక్కులు అణు కేంద్రం సొరంగంలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. ఇక 20వ తేదీన అక్కడికి కిలో మీటర్ దూరంలో చాలా ట్రక్కులు ఆగి ఉన్నట్లు గుర్తించారు. ఇక ప్రధాన కేంద్రంలోకి వెళ్లే మార్గంలో కొన్ని బుల్డోజర్లు కూడా కనిపించాయి. ఈ నేపథ్యంలో కచ్చితంగా దాడి జరగొచ్చనే అంచనాలతో కీలకమైన సామగ్రిని, యురేనియం నిల్వలను ఇరాన్ తరలించేసినట్లు అనుమానిస్తున్నారు.
ఉక్కు కవచంలా పర్వతం..
ఫోర్డో అణు ఇందన శుద్ధీకరణ కేంద్రం టెహ్రాన్ నగరానికి 100 కిలోమీటర్ల దూరం ఉంది. ఇక్కడ యురేనియం శుద్ధి చేస్తారు. ఇది నతాంజ్ కేంద్రమంత పెద్దది కాదు. ఒక పర్వతానికి అడుగు భాగాన దీనిని నిర్మించారు. వాస్తవానికి ఇది ఇరాన్‌లోని ఐఆర్‌జీసీ ఆధీనంలోని క్షిపణి కేంద్రంలో భాగం.
ఈ ప్రాంతానికి అనేక విమాన విధ్వంసక బ్యాటరీలు రక్షణ కల్పిస్తున్నాయి. వైమానిక దాడులను తట్టుకొని నిలిచేలా దీన్ని రూపొందించారు. దీని నిర్మాణం 2007లో మొదలైందని ఐఏఈఏ చెబుతోంది. అమెరికా, దాని మిత్రదేశాలకు 2009 వరకు ఈ కేంద్రం ఉన్నట్టు సమాచారం లేదు.
ఇక్కడ మూడు వేల వరకు ఐఆర్-1 శ్రేణి సెంట్రిఫ్యూజ్‌లు ఉన్నాయి. పౌర, సైనిక అవసరాల కోసం ఇవి యురేనియాన్ని శుద్ధి చేస్తున్నాయి. రష్యాకు చెందిన ఎస్-300ను కూడా ఇక్కడ మోహరించింది. దీని లొకేషన్ ఇజ్రాయెల్‌కు పెను సవాల్‌గా మారింది. ఇక్కడ ప్రతి మూడు నెలలకు 60 శాతం శుద్ధి చేసిన 166 కిలోల యురేనియాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.
వేల సెంట్రిఫ్యూజ్‌లకు కేంద్రం..
నతాంజ్ అణు శుద్ధీకరణ కేంద్రం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. వైమానిక దాడుల నుంచి తప్పించుకునేందుకు ఈ కేంద్రాన్ని భూగర్భంలో నిర్మించారు. వేగంగా యురేనియం శుద్ధి చేసే 50 వేల వరకు అణు సెంట్రిఫ్యూజ్ యంత్రాలు ఇక్కడ ఉన్నట్లు అంచనా. యురేనియాన్ని 60 శాతం శుద్ధి చేస్తుంది. బాంబ్ గ్రేడ్‌కు ఇది చాలా దగ్గరగా ఉంటుంది.
కోహ్-ఎ-కొలాంగ్ గాజ్ లా పర్వతాన్ని తొలిచి దాని అడుగున ఈ కేంద్రాన్ని విస్తరించే పనులు జరుగుతున్నాయి. ఈ కేంద్రంపై ఇజ్రాయెల్ అనేక సార్లు దాడులు చేసి ఉపరితల కేంద్రాన్ని ధ్వంసం చేసింది. కానీ, భూగర్భ కేంద్రం ఇంకా సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నారు.