Sarfaraz Khan: జట్టులో చోటు కోసం 17 కిలోలు తగ్గిన క్రికెటర్

సర్ఫరాజ్ ఖాన్(Sarfaraz Khan)” దేశవాళి క్రికెట్ లో ఓ సంచలనం. గత ఏడాది జాతీయ జట్టులో కూడా అడుగుపెట్టాడు. కాని చోటు నిలుపుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. న్యూజిలాండ్ తో జరిగిన మూడు టెస్ట్ ల సీరీస్ లో మంచి ప్రదర్శనే చేసిన ఈ ముంబై ఆటగాడు.. ఆ తర్వాత తిరిగి జట్టులోకి రావడానికి తీవ్రంగా కష్టపడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఎంపిక అయినా సరే తుది జట్టులో మాత్రం అతను ఆడలేకపోయాడు. ఇక ఇంగ్లాండ్ పర్యటనకు తనను ఎంపిక చేస్తారని భావించాడు. కానీ కొత్త ఆటగాళ్ళు జట్టులోకి వచ్చేశారు.
దీనితో అతను ఫిట్నెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేసాడు. సర్ఫరాజ్ ఖాన్ 17 కిలోల బరువు తగ్గడం ఇప్పుడు సంచలనం అయింది. అతని ఫిట్నెస్ విషయంలో తీవ్ర విమర్శలు వచ్చాయి. టాలెంట్ ఉన్నా సరే ఫిట్నెస్ లేకపోతే తుది జట్టులో నిలబడటం కష్టమే. అందుకే అతను ఫిట్నెస్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి కష్టపడ్డాడు. దీనికి సంబంధించిన ఫోటో కూడా అతను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. తాను ఎలా ఉండేవాడిని, ఇప్పుడు ఎలా ఉన్నాను అంటూ తన పోస్ట్ లో రెండు ఫోటోలు పోస్ట్ చేసాడు.
ఇక ఇంగ్లాండ్ పర్యటన కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సర్ఫరాజ్‌ను పక్కన పెట్టిన సమయంలో హర్భజన్ సింగ్‌తో సహా పలువురు భారత మాజీ క్రికెటర్లు సర్ఫరాజ్‌ను మరింత బలంగా పుంజుకోవాలని సూచించారు. ఇది చాలా దురదృష్టకరం… జట్టులో అతని పేరు కనిపించకపోవడం నాకు కొంచెం షాక్ ఇచ్చింది. అతను తిరిగి వస్తాడని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను అంటూ హర్భజన్ కామెంట్ చేసాడు. తిరిగి రావాలనే సంకల్పం అతనిలో ఉందని.. కరుణ్ నాయర్(Karun Nair) ను చూసి అతను నేర్చుకోవాలని సూచించాడు. కాగా అతని స్థానంలో జట్టులోకి వచ్చిన కరుణ్ నాయర్ పెద్దగా రాణించడం లేదు.