Putin-Modi: పుతిన్ -మోడీ స్నేహమే సెంటరాఫ్ అట్రాక్షన్.. చైనా సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ ..

షాంఘై సహకార సంస్థ సదస్సులో పుతిన్(Putin), మోడీ (Modi) సెంటరాఫ్ అట్రాక్షన్ గా మారారు. ఎందుకంటే వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం, స్నేహబంధం .. చైనాలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. సోమవారం చైనాలోని ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వీరిద్దరి సాన్నిహిత్యానికి సంబంధించిన అంశాలే టాప్ ట్రెండింగ్‌లో నిలిచాయి.
చైనాలో అతిపెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అయిన ‘వీబో’లో “పుతిన్ కారులో మోడీ ప్రయాణం” అనే అంశం నంబర్ వన్ ట్రెండింగ్‌గా నిలిచింది. అదేవిధంగా, దేశంలోని ప్రముఖ సెర్చ్ ఇంజిన్ ‘బైడు’లో “మోడీ-పుతిన్ ఆలింగనం చేసుకుని, చేతిలో చేయి వేసి మాట్లాడుకున్నారు” అనే అంశం కోసం నెటిజన్లు ఎక్కువగా వెతికారు. ఎస్‌సీఓ సదస్సు ప్రాంగణం నుంచి ద్వైపాక్షిక సమావేశ వేదిక వద్దకు వెళ్లేందుకు ప్రధాని మోడీ కోసం పుతిన్ దాదాపు 10 నిమిషాల పాటు వేచి చూశారని, ఆ తర్వాత ఇద్దరూ ఒకే కారులో కలిసి ప్రయాణించారని వార్తలు వెలువడటంతో ఈ ట్రెండ్ ఒక్కసారిగా ఊపందుకుంది.
ఈ పరిణామం ఇరు దేశాల మధ్య ఉన్న “ప్రత్యేక స్నేహానికి” నిదర్శనమని చైనా సోషల్ మీడియా యూజర్లు అభిప్రాయపడుతున్నారు. చైనాలో అత్యంత ప్రజాదరణ పొందిన వీబో, బైడులలో మోడీ-పుతిన్‌ల బంధంపై ప్రజలు విపరీతమైన ఆసక్తి చూపారు.
టియాన్ జెన్ లో 25వ ఎస్‌సీఓ దేశాధినేతల మండలి సమావేశంలో పాల్గొన్న ప్రధాని మోడీ, తన రెండు రోజుల పర్యటనను ముగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో పాటు పలువురు ప్రపంచ నేతలతో చర్చలు జరిపారు. సదస్సును విజయవంతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌కు, చైనా ప్రభుత్వానికి, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ మోడీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
సదస్సులో ప్రసంగించిన మోడీ…. భద్రత, అనుసంధానం, అవకాశాలు అనే మూడు స్తంభాలపై భారతదేశ వైఖరిని స్పష్టం చేశారు. ఉగ్రవాదంపై సమష్టి పోరాటం, స్టార్టప్‌లు, యువత, సాంస్కృతిక మార్పిడికి మరిన్ని అవకాశాలు కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. సదస్సు ముగింపులో “టియాంజిన్ డిక్లరేషన్”ను ఆమోదించారు. ఎస్‌సీఓ తదుపరి అధ్యక్ష బాధ్యతలను కిర్గిజ్‌స్థాన్ స్వీకరించింది.