India : భారత్ నుంచి రష్యాకు పదిలక్షల మంది

రష్యాలోని పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మిక శక్తి కొరతను అధిగమించేందుకు భారత్ (India) వైపు ఆ దేశం దృష్టి సారించింది. ఈ మేరకు డిసెంబర్ నాటికి 10 లక్షల మంది నైపుణ్యం కలిగిన భారత కార్మికులకు రష్యా (Russia) ఉపాధి కల్పించనున్నట్లు తెలుస్తోంది. రష్యాలో యాకటెరిన్‌బర్గ్‌లో ఒక కొత్త కాన్సులేట్ జనరల్ (Consulate General) ప్రారంభం కానుంది. ఇది వలస కార్మికుల అంశాలను పరిశీలించనుంది. ఈ విషయాన్ని ఉరల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ చీఫ్ అండ్రీ బెసెడిన్ (Andrey Besedin) వెల్లడించారు. భారత్ నుంచి వచ్చే నైపుణ్యం ఉన్న కార్మికులు తమ కొరతను తీరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పారిశ్రామిక సంస్థలు ఉత్పత్తిని పెంచాలని భావించినా, కార్మికలు కొరతతో ఇబ్బందులు ఉన్నట్లు తెలిపారు.
రష్యాలోని ఉరల్ పర్వతాలకు సమీపంలోని యాకటెరిన్ బర్గ్ ప్రాంతం భారీ పరిశ్రమలకు నిలయంగా ఉంది. అక్కడ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ కూడా ఉంది. ఈ పారిశ్రామిక సంస్థలు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని బెసెడిన్ అన్నారు.