Rohit Sharma: రోహిత్ శర్మ సంచలన నిర్ణయం..?

టీమిండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కు పూర్తిస్థాయిలో గుడ్ బాయ్ చెప్పే అవకాశం ఉందా..? అంటే అవుననే అంటున్నాయి భారత్ క్రికెట్ వర్గాలు. టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్న రోహిత్ శర్మ.. త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ కు సైతం గుడ్ బై చెప్పడానికి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐపీఎల్ జట్టులో మాత్రమే కొనసాగడానికి అతను సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే బోర్డు పెద్దలకు కూడా రోహిత్ శర్మ సమాచారం పంపినట్లు జాతీయ మీడియా పేర్కొంది.
దీనిపై అతను త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండొచ్చని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. వచ్చే వన్డే వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ(Rohit Sharma) ఆడే అవకాశాలు ఉన్నాయని క్రికెట్ వర్గాలు భావించాయి. ఫిట్నెస్ కూడా బాగుండటంతో కొనసాగవచ్చని భావించారు. కానీ వయసుతో పాటుగా పలు కారణాలతో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. దీని వెనక వ్యక్తిగత కారణాల కంటే హెడ్ కోచ్ గౌతం గంభీర్ తో ఉన్న విభేదాలే కారణమని సమాచారం.
మరో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ(Virat Kohli) కూడా అదే నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉండవచ్చని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. అక్టోబర్ లో ఆస్ట్రేలియా పర్యటన ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత వీళ్ళిద్దరూ రిటైర్ కావచ్చని తెలుస్తోంది. ఇక వీరితో పాటుగా రవీంద్ర జడేజా(Ravindra Jadeja) కూడా అదే ఆలోచనలో.. ఉన్నట్లు క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న రవీంద్ర జడేజా త్వరలోనే టెస్ట్ క్రికెట్ కు కూడా గుడ్ బై చెప్పే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. అతని ఆట తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.