America:అమెరికాలో ఘోర ప్రమాదం .. హైదరాబాద్ చెందిన కుటుంబం సజీవ దహనం

అమెరికాలోని గ్రీన్‌కౌంటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్(Hyderabad) కు చెందిన ఒకే కుటుంబంలోని నలుగురు సజీవదహనమయ్యారు. కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్లి తిరుగొస్తున్న క్రమంలో వ్యతిరేక దిశలో వచ్చిన ఓ ట్రక్కు ఆ కుటుంబాన్ని కబళించింది. ప్రమాదం ధాటికి కారులో మంటలు చెలరేగడంతో తల్లిదండ్రులు వారి ఇద్దరు పిల్లలు దుర్మరణం చెందారు. మృతులు హైదరాబాద్ తిరుమలగిరికి చెందిన శ్రీ వెంకట్ (Sri Venkat) కుటుంబంగా బంధువులు నిర్ధరించారు. సికింద్రాబాద్ తిరుమలగిరి జూపిటర్ కాలనీకి చెందిన బెజిగం శ్రీవెంకట్, కొంపల్లి మున్సిపాలిటీ పరిధి ఎన్సీఎల్ నార్త్ అవెన్యూకు చెందిన చొల్లేటి తేజస్వినికు 2013లో వివాహమైంది. ఆ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు (Software engineers) గా పనిచేస్తున్నారు. వారికి తొమ్మిదేళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. మూడున్నరేళ్ల క్రితం శ్రీవెంకట్ ఉద్యోగరీత్యా అమెరికాలోని డల్లాస్‌కి వెళ్లాడు. వారు వెళ్లిన ఆరు నెలల తర్వాత భార్య పిల్లలను అక్కడికి తీసుకెళ్లాడు. తల్లిదండ్రులు పశుపతినాథ్, గిరిజను రెండేళ్ళకు అమెరికాకు తీసుకెళ్లాడు. వెంకట్ సోదరి దీపిక, మామ నాగరాజు ప్రస్తుతం అట్లాంటాలో నివాసం ఉంటున్నారు.
ప్రమాద స్థలంలో మృతుల గురించి తెలుసుకునేందుకు పోలీసులు పరిశీలించగా శ్రీవెంకట్ కుమారుడు సిద్ధార్థ పాఠశాల ఐడీకార్డు లభ్యమైంది. ఆ కార్డు ఆధారంగా డల్లాస్‌లోని పాఠశాలకు వెళ్లి ఆరా తీయగా వెంకట్ చిరునామా దొరికింది. పోలీసులు వెంకట్ నివాసానికి వెళ్లగా తాళం వేసి ఉంది. స్థానికులు ఇచ్చిన సమాచారం తో నలుగురూ అట్లాంటాలోని దీపిక వద్దకు వెళ్లినట్లు తెలుసుకొని ఆమెకి సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలంలో సిద్ధార్థ మృతదేహంలో కొంత భాగం లభ్యమైంది. పోలీసులు డీఎన్ఏ నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపారు. విషయం తెలుసుకొని కుత్బుల్లాపూర్‌కి చెందిన కూన శ్రీనివాస్‌గౌడ్, బాలప్ప తేజస్విని కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు.