Ravi Sastri: ఆ ఒక్క తప్పే ఇండియా కొంప ముంచింది

లార్డ్స్ లో జరిగిన మూడో టెస్ట్ ఇంగ్లాండ్ గెలవడాన్ని భారత మాజీ ఆటగాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై రవి శాస్త్రి, సునీల్ గవాస్కర్ సహా పలువురు మాజీ ఆటగాళ్ళు భారత్ వికెట్లు కోల్పోయిన తీరుపై మండిపడుతున్నారు. రవి శాస్త్రి మాట్లాడుతూ తొలి ఇన్నింగ్స్ లో రిషబ్ పంత్(Rishab Pant) అవుట్, రెండో టెస్టులో కరుణ్ నాయర్(Karun Nair) వికెట్‌లు కోల్పోవడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. 193 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌ను 170 పరుగులకు ఆలౌట్ చేసింది ఇంగ్లాండ్. ఈ టెస్ట్ మ్యాచ్‌లో నాకు టర్నింగ్ పాయింట్, మొదట, రిషబ్ పంత్ అవుట్ అంటూ రవి శాస్త్రి కామెంట్ చేసాడు.
3వ రోజు లంచ్ బ్రేక్ సమయానికి పంత్ 74 పరుగుల వద్ద రనౌట్ అయ్యాడు. అప్పటి వరకు భారత్ పటిష్ట స్థితిలో ఉన్న సమయంలో పంత్ వికెట్ కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో కరుణ్ నాయర్ కూడా తన వికెట్ ను అనవసరంగా సమర్పించాడని, ఆ వికెట్ ను కోల్పోవడం భారత్ ను మరిన్ని కష్టాల్లో నెట్టిందని కామెంట్ చేసాడు. రెండో ఇన్నింగ్స్ లో జడేజా, బూమ్రా, సిరాజ్ డిఫెన్స్ లో ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదు అని, టాప్ ఆర్డర్ ఆటగాళ్ళు వికెట్ కాపాడుకోవడంలో మొత్తం తప్పులే చేసారని మండిపడ్డాడు.
22 పరుగులతో ఓడిపోవడమే తనకు గొప్ప విజయంలా కనపడింది అన్నాడు రవి శాస్త్రి. కొంచెం జాగ్రత్త పడి ఉంటే ఖచ్చితంగా భారత్ మంచి విజయం సాధించేదని అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను అభినందించాలి అన్నాడు రవి శాస్త్రి. అతనికి పంత్ వికెట్ కీలకమని అందుకే పంత్ ను టార్గెట్ చేసాడన్నాడు. స్టోక్స్ పట్టుదలగా 24 ఓవర్ల పాటు బౌలింగ్ చేసాడని, అది ఇంగ్లాండ్ కు కలిసి వచ్చిందని తెలిపాడు. కాగా బ్యాటింగ్ లో కూడా బెన్ స్టోక్స్ ఆకట్టుకున్నాడు.