Tianjin: బ్రిక్స్ బలోపేతానికి కృషి చేస్తాం.. వివక్షాపూరిత ఆంక్షల్ని ప్రతిఘటిస్తామన్న పుతిన్..

షాంఘై సహకార సదస్సు సందర్భంగా పెద్దన్న అమెరికాకు.. గట్టి రణనినాదమే వినిపించింది. ఆ వినిపించింది ఎవరో కాదు రష్యాఅధ్యక్షుడు పుతిన్ (Putin).. నిన్నటి వరకూ నేరుగా మాట్లాడాలంటే సంకోచించే స్థాయి నుంచి ఇప్పుడు ఏకంగా షాంఘై సదస్సు నుంచి అమెరికాకు పరోక్ష హెచ్చరికలు పంపించారు పుతిన్.బ్రిక్స్ దేశాల సామాజిక ఆర్థికాభివృద్ధిని అడ్డుకునేందుకు వివక్షాపూరిత ఆంక్షలు విధిస్తే రష్యా, చైనాలు సమష్టిగా ప్రతిఘటిస్తాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు. షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) సదస్సుకు హాజరయ్యేందుకు తియాన్‌జిన్ చేరుకున్న పుతిన్ .. ఈకీలక వ్యాఖ్యలు చేశారు.
‘‘కీలకమైన మౌలిక సదుపాయాల కోసం అదనపు వనరులను సంఘటితపరచడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తాం. ప్రపంచ సవాళ్లను అధిగమించేలా బ్రిక్స్ దేశాల సామర్థ్యం బలోపేతానికి సంయుక్త వైఖరితో పనిచేస్తాం. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకులాంటి అంతర్జాతీయ సంస్థల్లో ఆర్థిక సంస్కరణలకు బ్రిక్స్ మద్దతుగా నిలుస్తుంది. ఈ సంస్థల్లో వాస్తవిక సమానత్వం, అన్ని దేశాలకూ సమాన లబ్ధి అనే సూత్రాల ప్రాతిపదికన నూతన ఆర్థిక వ్యవస్థకు మేం పిలుపునిస్తున్నాం. ఈ సంస్థల్లో రుణ సాధనాలను నయా వలసవాదానికి కొన్ని దేశాలు వాడుకోవడం సరికాదు. వ్యూహాత్మక రంగాల్లో బ్రిక్స్ దేశాల మధ్య భాగస్వామ్యం కోసం ఉమ్మడి వేదికలను సిద్ధం చేస్తాం’’ అని పుతిన్ వెల్లడించారు.
డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసే ఏ దేశం, ఏకూటమిపైనైనా తాము ఆంక్షలు విధిస్తామని ఇప్పటికే అమెరికా హెచ్చరించింది. అందులో భాగంగా బ్రిక్స్ దేశాలకు హెచ్చరికలు పంపింది. బ్రిక్స్ దేశాలు సొంత కరెన్సీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోందని.. ఆదిశగా అడుగులు వేస్తే బ్రిక్స్ కూటమి దేశాలపై పదిశాతం సుంకాలు విధిస్తానని ఇప్పటికే ట్రంప్ హెచ్చరించారు కూడా. ఇప్పుడు ఆ హెచ్చరికలను బేఖాతర్ చేస్తూ.. పుతిన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది నేరుగా అమెరికాను హెచ్చరించడమే అని కొందరు అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.