BRICS Summit: భద్రతామండలిని సంస్కరించాల్సిందే… బ్రిక్స్ సదస్సులో మోదీ పిలుపు

అభివృద్ధి, వనరుల పంపిణీ, భద్రత సహా అన్నింటా ద్వంద్వ ప్రమాణాలకు దక్షిణార్ధ గోళం (గ్లోబల్ సౌత్) బాధితురాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వంటి కీలక సంస్థలను ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా సత్వరం సంస్కరించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. బ్రెజిల్ (Brazil)లోని రియో డి జనీరో నగరం వేదికగా ప్రారంభమైన బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు (BRICS Summit)లో మోదీ ప్రసంగించారు. 20వ శతాబ్దంలో ఏర్పాటైన అంతర్జాతీయ సంస్థల్లో, ప్రపంచ జనాభాలోని మూడిరట రెండొంతుల మందికి సముచిత ప్రాతినిధ్యం లభించలేదని పేర్కొన్నారు. గ్లోబల్ సౌత్ (Global South)కు తగిన ప్రాతినిధ్యం లేని ఆ సంస్థలు సిమ్‌కార్డును కలిగి ఉన్నప్పటికీ నెట్‌వర్క్ లేని మొబైల్ ఫోన్‌లాంటివని వ్యాఖ్యానించారు. పర్యావరణ పరిరక్షణకు ఆర్థిక సహాయం, సుస్థిరాభివృద్ధి, సాంకేతికత లభ్యత వంటి అంశాల్లో దక్షిణార్ధ గోళ దేశాలకు కంటితుడువు చర్యలు తప్ప ఏమీ దక్కలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.