Tokyo: జపాన్ టెక్నాలజీ.. భారత్ మేథ కలిస్తే మనమే లీడర్స్…. జపాన్ పర్యటనలో మోడీ పిలుపు..

చారిత్రక బంధం, చిరకాల మిత్రదేశమైన జపాన్ లో భారత ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటన కొనసాగుతోంది. భారత్-జపాన్ సంయుక్త ఆర్థిక సదస్సు (India-Japan Joint Economic Forum) లో ప్రసంగించిన మోడీ.. మేకిన్ ఇండియా కోసం రావాలని.. ప్రపంచం కోసం తయారీ చేపట్టాలని వ్యాపారవేత్తలకు సూచించారు.
సెమీకండక్టర్ల పరిశ్రమల నుంచి స్టార్టప్‌ల వరకూ జపాన్ భారత్‌కు అత్యంత కీలక భాగస్వామిగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. జపాన్ సంస్థలు భారత్‌లో 40 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టాయని గుర్తుచేశారు.‘‘80 శాతం కంపెనీలు భారత్‌లో తమ సంస్థలను విస్తరించాలని కోరుకుంటున్నాయి. 75 శాతం కంపెనీలు ఇప్పటికే లాభాల్లో ఉన్నాయి. భారత్‌లో మూలధనం ఎన్నో రెట్లు పెరుగుతోంది. గత 11 ఏళ్లలో భారత్‌లో గతంలో ఎన్నడూ లేని మార్పులు చోటుచేసుకున్నాయి. రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, విధానాల్లో పారదర్శకత వచ్చాయి. ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్. త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది’’ అని మోడీ వివరించారు.
సాంకేతిక రంగంలో భారత్, జపాన్ కలిసి పనిచేసే అవకాశాలపై మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఏఐ, సెమీకండక్టర్లు, క్వాంటం కంప్యూటింగ్, బయోటెక్, అంతరిక్ష రంగాల్లో భారత్ ఎంతో ధైర్యమైన, ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాలు చేపట్టింది. జపాన్ సాంకేతికత, భారత ప్రతిభావంతుల మేధస్సు కలిస్తే ఈ శతాబ్దపు సాంకేతిక విప్లవానికి నాయకత్వం వహించవచ్చు” అని మోడీ తెలిపారు. ఈ రెండు దేశాల ఉమ్మడి ప్రయోజనాలు ఉమ్మడి శ్రేయస్సుగా మారాయని, జపాన్ వ్యాపారాలకు భారత్ ఒక మంచి వేదిక అని ఆయన పేర్కొన్నారు
ఈ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని ఇషిబాతో మోడీ భేటీ కానున్నారు. ఏఐ, సెమీ కండక్టర్లు, బుల్లెట్ రైలు, పెట్టుబడులే అజెండాగా వీరి మధ్య ద్వైపాక్షిక చర్చ జరగనుంది. అక్కడి నుంచి ప్రధాని మోడీ నేరుగా చైనా (Modi China Visit) వెళ్లనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబరు 1వ తేదీల్లో తియాంజిన్ వేదికగా జరిగే షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొంటారు. 2020లో లద్దాఖ్ సరిహద్దుల్లో భారత్-చైనా సైనికుల మధ్య ఘర్షణల అనంతరం ప్రధాని మోడీ చైనాను సందర్శిస్తుండటం ఇదే మొదటిసారి.