PM Modi: ట్రినిడాడ్ అండ్ టొబాగోలో ప్రధాని మోడీ.. ఆ దేశంలో యూపీఐ సేవలు ప్రారంభం!

భారతదేశ ఎదుగుదలకు ఆకాశం కూడా హద్దు కాదని ప్రధాని మోడీ (PM Modi) ధీమా వ్యక్తం చేశారు. ఐదు దేశాల పర్యటనలో భాగంగా ట్రినిడాడ్ అండ్ టొబాగోలో పర్యటించిన ఆయన.. అక్కడి ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించారు. 1999 తర్వాత ఒక భారత ప్రధాని ఈ దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ కార్యక్రమంలో ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రధాని కమలా ప్రసాద్ బిసెస్సర్, ఆమె మంత్రివర్గ సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. ప్రవాస భారతీయులను ప్రధాని మోడీ (PM Modi) ఎంతగానో కొనియాడారు. వారు తమ మాతృభూమిని వీడి వచ్చినా, తమ భారతీయ గుర్తింపును ఎన్నడూ వదులుకోలేదని ప్రశంసించారు.
ఈ సందర్భంగా ప్రధాని కమలా ప్రసాద్ బిసెస్సర్ కుటుంబ మూలాలు భారత్‌లోని బిహార్‌లో ఉన్నాయని మోడీ గుర్తు చేశారు. ఆమెను ‘బిహార్ కీ బేటీ’ (బిహార్ బిడ్డ) అని సంబోధిస్తూ, “కమలా గారి పూర్వీకులు బిహార్‌లోని బక్సర్‌కు చెందినవారు. ఆమె స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఆమెను అందరూ చాలా గర్వంగా ‘బిహార్ బిడ్డ’ అని పిలుస్తారు. ఇక్కడ చాలా మంది పూర్వీకులు బిహార్‌కు చెందినవారే” అని ఆయన (PM Modi) వివరించారు. ఈ క్రమంలో ఈ దేశంలో యూపీఐ సేవలు కూడా ప్రారంభించిన ప్రధాని మోడీ.. భారత డిజిటల్ చెల్లింపుల్లో ఈ సేవ ఎంతో మార్పు తెచ్చిందని చెప్పారు. వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ల కన్నా యూపీఐ చెల్లింపులు వేగంగా జరుగతాయంటూ చమత్కరించారు.