Narendra Modi : మోదీకి నమీబియా అత్యున్నత పౌర పురస్కారం

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) కి మరో అరుదైన గౌరవం లభించింది. నమీబియా (Namibia) పర్యటనలో ఉన్న ఆయనకు ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విచ్చియా మిరాబిలిస్ ను ప్రధానం చేశారు. నమీబియా అధ్యక్షురాలు డాక్టర్ నెటుంబో నంది-ఎన్ ద్వైతా (Dr. Netumbo Nandi-N Dwaita) ఈ అవార్డును మోదీకి అందజేశారు. నమీబియాతో పాటు ప్రపంచ శాంతి, న్యాయం, సామాజిక ఆర్థిక అభివృద్ధికి మోదీ చేసిన సేవలను అధ్యక్షురాలు ప్రశంసించారు.
నరేంద్ర మోదీ 2014 మేలో ప్రధాని (Prime Minister)గా బాధ్యతలు చేపట్టినప్పటి ఇంతవరకూ 26 అంతర్జాతీయ పురస్కారాలు అందుకోగా, నమీబియా పురస్కారం 27వది. నమీబియా అత్యున్నత పౌర పురస్కారం వెల్విచ్చియా మిరాబిలి తో అందుకోవడం చాలా ఆనందంగా ఉందని మోదీ అన్నారు. నమీబియా అధ్యక్షురాలు, ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలోని 140 కోట్ల మంది భారతీయుల తరఫున ఈ పురస్కారాన్ని అందుకుంటున్నానని చెప్పారు. ఇండియా-నమిబియా మధ్య ఎప్పటికీ చెక్కుచెదరని చిరకాల స్నేహం ఉందని, ఈరోజు ఇక్కడ అందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. తనకు ఇచ్చిన పురస్కారాన్ని నమీబియా, ఇండియా ప్రజలకు అంకితమిస్తున్నానని తెలిపారు.