Narendra Modi: ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం

భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi )కి బ్రెజిల్ (Brazil)అత్యున్నత పౌర పురస్కారమైన గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్ లభించింది. ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంలో ఆయన కృషి, కీలకమైన ప్రపంచ వేదికలపై ఇరు దేశాల సహకారాన్ని పెంపొందిస్తున్న తీరుకు గానూ బ్రెజిల్ అధ్యక్షుడు ఇనాసియో లులా డ సిల్వా (Inacio Lula da Silva ) దీనిని మోదీకి ప్రధానం చేశారు. ఇలాంటి అంతర్జాతీయ పురస్కారాలను మోదీ అందుకోవడం ఇది 26వ సారి. ఈ పురస్కారం తనకు మాత్రమే కాకుండా 140 కోట్లమంది భారతీయుల(Indians)కూ గర్వకారణమని, ఇవి ఉద్వేగపూరిత క్షణాలని ఆయన పేర్కొన్నారు. డ సిల్వాతో ద్వైపాక్షిక చర్చల అనంతరం మోదీ మాట్లాడుతూ అన్ని వివాదాలనూ చర్చలు, దౌత్యం ద్వారానే పరిష్కరించుకోవాలనేది తమ ఏకాభిప్రాయమని చెప్పారు. అనిశ్చితి, ఉద్రిక్తతలు రాజ్యమేలుతున్న తరుణంలో సుస్థిరత, సమతౌల్యతకు ఇరు దేశాల భాగస్వామ్యం మూలస్తంభంలా నిలుస్తుందన్నారు. రక్షణ రంగంలో సహకారం బలోపేతం కావడం పరస్పర విశ్వాసానికి చిహ్నమని పేర్కొన్నారు.