Operation Sindoor: మోడీకి అక్కడి నుంచి ఫోన్ కాల్, పార్లమెంట్ లో జై శంకర్ సంచలనం

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో చిన్నపాటి యుద్దానికి దిగిన సంగతి తెలిసిందే. అనంతరం పాకిస్తాన్ కూడా ఎదురు దాడి చేసింది. ఈ యుద్ధం తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉండటంతో.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) జోక్యం చేసుకున్నట్టు ప్రకటించారు. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించాను అని ట్రంప్ ఓ ప్రకటన చేసారు. ఆ తర్వాత కేంద్ర విదేశాంగ కార్యదర్శి మీడియా ముందుకు వచ్చి కాల్పుల విరమణ అమలులోకి వచ్చిందని ప్రకటించారు.
ఇక ట్రంప్ పలు వేదికల్లో మాట్లాడుతూ రెండు దేశాలను వాణిజ్య ఒప్పందం పేరుతో దారిలోకి తీసుకొచ్చానని ప్రకటించారు. దీనిపై భారత ప్రభుత్వ వర్గాలు తీవ్రంగా స్పందించాయి. దాదాపు 20 సార్లు పలు వేదికల్లో ట్రంప్.. ఇదే వ్యాఖ్యలు చేసారు. దీనిపై తాజాగా విదేశాంగ శాఖా మంత్రి జై శంకర్ కీలక వ్యాఖ్యలు చేసారు. లోక్‌సభలో జైశంకర్ మాట్లాడుతూ, ఏప్రిల్ 22 నుంచి జూన్ 17 వరకు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని మోదీ(Narendra Modi) మధ్య ఎలాంటి ఫోన్ సంభాషణ జరగలేదని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్, అమెరికాతో జరిపిన చర్చలను వెలుగులోకి తెస్తూ, అమెరికా ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ప్రధాని మోడీకి ఫోన్ చేసి, పాకిస్తాన్ నుండి భారీ దాడి జరుగుతుందని హెచ్చరించారని జైశంకర్ అన్నారు. దీనికి మోడీ.. భారత్ మరింత బలంగా స్పందిస్తుందని బదులిచ్చారని వెల్లడించారు. మే 9, 10 తేదీలలో పాకిస్తాన్ నుండి పదే పదే జరుగుతున్న దాడులను భారత ఆర్మీ విజయవంతంగా తిప్పికొట్టిందని జైశంకర్ వెల్లడించారు. మే 10న అనేక దేశాలు భారత్ ను సంప్రదించి, పాకిస్తాన్ కాల్పుల విరమణకు సిద్ధంగా ఉందని తెలియజేశాయని తెలిపారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) ఛానల్ ద్వారా వస్తేనే పాకిస్తాన్ నుండి కాల్పుల విరమణ చర్చలను పరిశీలిస్తామని భారత్ అన్ని దేశాలకు స్పష్టం చేసిందని జై శంకర్ వెల్లడించారు.