Pakistan: ఇండస్ ట్రీటీ రద్దుతో దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్..

పహల్గాం(Pahalgam terror attack)లో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడితో ఆగ్రహంగా ఉన్న భారత్.. .. పాకిస్థాన్‌కు గట్టి షాకిచ్చింది. సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకు దాయాదితో సింధూ నదీ జలాల ఒప్పందాన్ని (Indus Water treaty) తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాకిస్తాన్ తీవ్ర ఆందోళన చెందుతోంది. ఎందుకంటే.. పాక్ జీవనాడిగా ఇండస్ ఒప్పందాన్ని చెప్పవచ్చు. ఇప్పుడిదే ప్రమాదంలో పడడంతో ఏం చేయాలో పాకిస్తాన్ కు తెలియడం లేదు. ఫలితంగా భారత్ తీరు ఏకపక్షమంటూ పాక్ (Pakistan) అక్కసు వెళ్లగక్కింది.
‘‘సింధూ నదీ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధం. ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు మధ్యవర్తిగా ఉన్న ఈ ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగే అవకాశం లేదు. ఈ చర్యతో నీటి యుద్ధానికి తెరతీస్తున్నారు. ఈ జలాల్లో ప్రతి నీటి చుక్కా మాదే..! ఈ హక్కును మేం చట్టపరంగా, రాజకీయంగా, అంతర్జాతీయంగా పూర్తిశక్తితో కాపాడుకుంటాం’’ అని పాకిస్థాన్ మంత్రి అవాయిస్ లెఘారీ ఓ పోస్ట్‌లో రాసుకొచ్చారు.అయితే ఏ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాన్నైనా రద్దుచేసుకునే హక్కు భారత్‌కు ఉంటుంది. అంతర్జాతీయ ఒప్పందాలకు సంబంధించిన వియన్నా ఒప్పందంపై భారత్ సంతకం చేయలేదు. కాబట్టి పాక్ ఏ కోర్టుకు వెళ్లినా, అంతర్జాతీయ సంస్థకు వెళ్లినా వారు ఎటువంటి తీర్పు ఇచ్చినా భారత్‌కు వర్తించదు.
పాకిస్థాన్ కీలక భేటీ..
మరోవైపు భారత్ తీసుకున్న నిర్ణయాలపై చర్చించేందుకు పాక్ కీలక సమావేశం నిర్వహించింది. ఇస్లామాబాద్‌లో ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన జాతీయ భద్రతా కమిటీ సమావేశం జరిగింది. ఈ భేటీలో పాక్ సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు, మంత్రులు, భద్రతా కమిటీ సభ్యులు, ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు. భారత నిర్ణయాలకు వ్యతిరేకంగా పాక్ విదేశాంగ శాఖ చేసిన ప్రతిపాదనలను ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ పరిణామాలపై చట్టపరంగా ముందుకెళ్లే అంశాలను పరిశీలించినట్లు సమాచారం.
1960ల్లో భారత్, పాక్ మధ్య సింధూ నదీ జలాల ఒప్పందం కుదిరింది. ఉగ్రదాడి దృష్ట్యా దీని అమలును న్యూఢిల్లీ నిలిపివేసింది. ఇది దాయాదికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఒప్పందం నిలిపివేత పాకిస్థాన్‌ను ఎండబెట్టే అవకాశాలున్నాయి. ఆ దేశంలో నీటి సరఫరా అత్యధికంగా సింధూ జలాలపైనే ఆధారపడింది. అక్కడ వ్యవసాయానికి వాడే నీటిలో 80శాతం ఈ ఒప్పందం కింద లభించేదే. పాకిస్థాన్ జీడీపీలో 25శాతం ఈ నదుల నుంచే లభిస్తోందంటే.. భారత నిర్ణయం ఆ దేశాన్ని భవిష్యత్తులో ఎలా ప్రభావితం చేయనుందో అర్థం చేసుకోవచ్చు..!