Islamabad: పహల్గాం ఉగ్రదాడిని సమర్థించేందుకు పాక్ ఆపసోపాలు..

పహల్గాంలో ఉగ్రవాదుల ఘాతుకాన్ని ప్రపంచం మొత్తం ఖండిస్తోంది. ఉగ్రవాదానికి ఎలాంటి పరిమితులు లేవని.. ఎక్కడైనా ఉగ్రవాదం, ఉగ్రవాదమే అని స్పష్టం చేస్తోంది. ఆఖరుకు మనతో ఎప్పుడు గొడవలకు దిగే చైనా సైతం.. ఈదాడిని ఖండించింది.కానీ పాకిస్తాన్ మాత్రం .. ఈ దాడిని సమర్థించేందుకు నానా పాట్లు పడుతోంది. ఎందుకంటే ఈదాడిని చేసిన ఉగ్రవాదులకు .. సర్వం సమకూర్చింది పాకిస్తాన్ కాబట్టి. కాదని .. వేరేగా మాట్లాడితే ఉగ్రవాదుల నుంచి ప్రతిఘటన తప్పదు .. కాబట్టి సమర్థించేందుకు ప్రయత్నిస్తూ..ప్రపంచం ముందు దోషిగా నిలబడుతోంది.
పహల్గాం దాడి సీమాంతర కుట్రేనని దాయాదిపై న్యూఢిల్లీ విరుచుకుపడింది. అయితే, ఈ దాడి (Pahalgam Terror Attack)తో తమకు సంబంధం లేదని పాక్ చెప్పింది. ఈ పరిణామాల వేళ స్వయంగా ఆ దేశ ఉప ప్రధాని (Pak Deputy PM) ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులు స్వాతంత్ర్య సమరయోధులంటూ ప్రేలాపనలు చేశారు. ‘‘ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లోని పహల్గాం జిల్లాలో దాడికి పాల్పడినవారు స్వాతంత్ర్య సమరయోధులై ఉంటారు’’ అని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈసందర్భంగా సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై స్పందిస్తూ.. ఈ ఏకపక్ష నిర్ణయాన్ని మేం ఎన్నటికీ అంగీకరించబోమన్నారు. దీనికి ప్రతిచర్య తప్పదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
సింధూ జలాల నిలిపివేతపై పాక్‌కు భారత్ లేఖ
సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికేవరకు పాక్‌తో చేసుకున్న సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని న్యూఢిల్లీ దాయాదికి అధికారికంగా సమాచారమిచ్చింది.. ఈమేరకు భారత నీటి వనరుల కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ.. పాక్ అధికారి సయీద్ అలీ ముర్తుజాకు లేఖ పంపారు. ‘‘ఏ ఒప్పందాన్నైనా నిజాయతీగా గౌరవించడం అనేది ప్రాథమిక బాధ్యత. కానీ, జమ్మూకశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని కొనసాగిస్తోంది. ఈ భద్రతాపరమైన అనిశ్చితులు మా హక్కులను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తున్నాయి. అందుకే, ఈ ఒప్పందాన్ని తక్షణమే నిలిపివేస్తున్నాం’’ అని భారత్ ఆ లేఖలో పేర్కొంది.