Afghanistan: ఆఫ్గనిస్తాన్ లో భూకంప విషాదం.. ఆదుకునేందుకు సిద్ధమన్న భారత్

ఆఫ్గనిస్తాన్ ను భారీ భూకంపం కుదిపేసింది. ఆదివారం అర్థరాత్రి రిక్టర్ స్కేలుపై 6.0 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ పెను భూకంపం ధాటికి 800 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2,500 మందికి పైగా గాయపడ్డారు. అనేక గ్రామాలు దెబ్బతిన్నాయి. ఈ క్లిష్ట సమయంలో అంతర్జాతీయ సమాజం, మానవతా సంస్థలు ఆదుకోవాలని తాలిబన్ ప్రభుత్వం కోరింది.
ఇదే సమయంలో, బాధితుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని వార్దక్ ప్రావిన్స్ మాజీ మేయర్ జరీఫా ఘఫ్పారీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తాలిబన్ ప్రభుత్వం సహాయక చర్యలను సమర్థవంతంగా నిర్వహించలేకపోతోందని ఆమె ఆరోపించారు. మానవతా సంస్థలు, అంతర్జాతీయ సమాజం వెంటనే స్పందించి బాధితులను ఆదుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
అఫ్ఘనిస్తాన్ (Afghanistan)లో సంభవించిన భారీ భూకంపం (Earthquake)లో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ‘అఫ్ఘాన్ భూకంపంలో జరిగిన ప్రాణనష్టం తీవ్ర విచారం కలిగిస్తోంది. ఈ విపత్తులో కుటుంబసభ్యులు, సన్నిహితులను కోల్పోయిన వారికి తగిన శక్తినివ్వాలని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. బాధితులను ఆదుకునేందుకు అన్నిరకాల మానవతా సాయాన్ని అందించేందుకు భారత్ సిద్ధంగా ఉంది’ అని మోడీ ట్వీట్ చేశారు.
ఆహార సామగ్రి సరఫరా
కాగా, అఫ్ఘాన్ భూకంపంలో పెద్దఎత్తున ప్రాణనష్టం జరగడంపై భారత విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ ఆదేశ విదేశాంగ మంత్రి అమిర్ ఖాన్ ముత్తాఖికి సంతాపం తెలియజేశారు. భారత్ అన్నివిధాలా ఆదుకుంటుందని చెప్పారు. టెంట్లు, ఆహార సరఫారాలు, ఇతర సహాయక సామాగ్రిని అఫ్ఘాన్‌కు పంపుతున్నట్టు తెలిపారు.