Oman: ఒమన్‌లో మారిన వర్క్ రూల్స్ … అభ్యర్థులు పారా హుషార్..

గల్ఫ్ దేశమైన ఒమన్ (Oman) లో వర్క్ రూల్స్‌లో భారీ మార్పులు తీసుకొచ్చారు. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా కొన్ని రంగాల ప్రొఫెషనల్స్ కచ్చితంగా సర్టిఫికేషన్ చేయించుకోవాలి. ఇంజినీర్లు కచ్చితంగా ఒమన్ సొసైటీ ఆఫ్ ఇంజినీర్స్ క్లాసిఫికేషన్ సర్టిఫికెట్‌ను.. సెక్టార్ స్కిల్ యూనిట్ ఆమోదంతో పొందాలి. వర్క్‌పర్మిట్ పునరుద్ధరించుకోవడానికి ముందే దీనిని తీసుకోవాలి.
ఇక సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 20 రకాల అకౌంటింగ్, ఫైనాన్షియల్ విభాగాల్లో పనిచేసేవారు కచ్చితంగా ఇలాంటి ధ్రువీకరణే తీసుకోవాల్సి ఉంటుంది. వీటిల్లో అకౌంట్స్ టెక్నిషియన్స్, అసిస్టెంట్ ఎక్స్‌టర్నల్ ఆడిటర్, అసిస్టెంట్ ఇంటర్నల్ ఆడిటర్, ఇంటర్నల్ ఆడిటర్, ఎక్స్‌టర్నల్ ఆడిటర్, కాస్ట్ అకౌంటెంట్, క్రెడిట్ ఎనలిస్ట్, ఫైనాన్షియల్ ఎనలిస్ట్, అకౌంట్స్ మేనేజర్, ట్యాక్స్ మేనేజర్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్, ఎక్స్‌టర్నల్ ఆడిట్ మేనేజర్, ఇంటర్నల్ ఆడిట్ మేనేజర్, సీనియర్ ఇంటర్నల్ ఆడిట్ మేనేజర్, హెడ్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిట్ మేనేజర్, ఎక్సటర్నల్ ఆడిట్ పార్ట్‌నర్, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి.
దీంతోపాటు యజమానులు, విదేశీ ఉద్యోగులు వర్క్‌పర్మిట్ కోసం ఈపోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. సరైన క్రెడెన్షియల్స్ లేని వారికి వర్క్‌పర్మిట్ జారీ లేదా పునరుద్ధరణ జరగదు. గల్ఫ్ కోపరేషన్ కౌన్సిల్‌లోని దేశాల్లో పని చేసే వారిలో నైపుణ్యాలను పెంచడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకొన్నారు. ఇప్పటికే సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాల్లో ఇలాంటి చర్యలే అమలు చేస్తున్నారు.
ఇక ఒమన్.. ఇంజినీర్లు, అకౌంటెంట్ వృత్తి నిపుణులను సర్టిఫికేషన్‌తో లేబర్ మార్కెట్‌లో నైపుణ్యాలను మరింత పెంచుతోంది. ఇందుకోసం కచ్చితమైన డెడ్‌లైన్, డిజిటల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వంటి చర్యలు తీసుకుంటోంది. ఈ చర్యలతో యజమానులు కూడా దేశంలో నిరాటంకంగా తమ పనులు చేసుకోవడానికి అవకాశం లభిస్తుంది. వృత్తి నిపుణులు కూడా తమ ఉద్యోగాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా పని చేసుకోవచ్చు.