NATO : ట్రంప్ ఒత్తిడికి తలొగ్గిన నాటో … రక్షణ వ్యయ పెంపుదలకు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నుంచి వచ్చిన తీవ్ర ఒత్తిడికి తలొగ్గిన ఉత్తర అట్లాంటిక్ సైనిక కూటమి (నాటో) సభ్య దేశాలు తమ రక్షణ వ్యయాన్ని భారీగా పెంచేందుకు అంగీకరించాయి. కూటమి సభ్యదేశాల్లో ఎవరిపై దాడి జరిగినా సమష్టిగా తిప్పి కొడతామని ప్రతినబూనాయి. రక్షణ వ్యయాన్ని పెంచుకంటూ 2035 నాటికల్లా ఏటా స్థూలా జాతీయోత్పత్తిలో 5 శాతాన్ని కీలక రక్షణావసరాల కోసం ఖర్చుచేసే స్థాయికి చేరాలని సంకల్పించినట్లు 32 దేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి. వ్యయ లక్ష్యాన్ని ఏ మేరకు చేరుకున్నామో 2029లో సమీక్షించుకుందామని నెదర్లాండ్స్ (Netherlands)లోని ద హేగ్ నగరంలో శిఖరాగ్ర సదస్సులో కూటమి దేశాలు తీర్మానించాయి. ఈ సంయుక్త లక్ష్యాన్ని తాను చేరుకోలేనని స్పెయిన్ (Spain) ఇప్పటికే ప్రకటించింది. రక్షణవ్యయ పెంపుదలకు సుముఖత వ్యక్తం చేస్తున్న దేశాలు అనేక ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ట్రంప్ చేపట్టిన సుంకాల పెంపు వాటి ఆర్థిక పరిస్థితిని మరింత జటిలం చేసింది. కొన్ని దేశాలు సంక్షేమానికి కోతపెట్టి అలా మిగిలిన మొత్తాలను రక్షణకు మళ్లించాలని చూస్తున్నాయి. నాటో సమష్టి అణ్వస్త్ర లక్ష్యాల సాధనలో భాగంగా అణ్వాయుధాలు మోసుకెళ్లే సామర్థ్యం ఉన్న డజను ఎఫ్-35ఏ యుద్ద మిమానాలను అమెరికా (America) నుంచి కొనుగోలు చేయనున్నట్లు బ్రిటన్ ప్రధాని కెయిర్ స్టార్మర్ ఈ సదస్సులో ప్రకటన చేశారు. ద హేగ్‌లో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. నాటో సభ్యదేశాలు రోణ వ్యయాన్ని పెంచుకుంటే భవిష్యత్తులో రష్యా ఉక్రెయిన్‌పై దాడికి సాహసించదని ట్రంప్ భరోసా ఇచ్చారు.