Modi:ప్రధాని మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పురస్కారం

ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. ట్రినిడాడ్ అండ్ టొబాగో (Trinidad and Tobago) పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ (Modi)కి, ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. పోర్ట్ ఆఫ్ స్పెయిలోని అధ్యక్ష భవనంలో జరిగి కార్యక్రమంలో ఆ దేశ అధ్యక్షురాలు క్రిస్టైన్ కార్లా కంగాలో చేతుల మీదుగా ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో (Republic of Trinidad and Tobago) పురస్కారాన్ని ప్రదానం చేశారు. అంతేకాకుండా ఈ అవార్డును అందుకున్న తొలి విదేశీ నాయకుడిగా ప్రధాని మోదీ నిలిచారు. అనంతరం పార్లమెంట్ (Parliament )లో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి.
140 కోట్ల మంది భారతీయుల తరఫున తాను ఈ పురస్కారాన్ని స్వీకరిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు . దేశ అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అందజేసినందుకు ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రజలకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పురస్కారం ఇరుదేశాల మధ్య శాశ్వత స్నేహ సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. 180 ఏళ్ల క్రితం నుంచి భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇక్కడ స్థిరపడిన భారతీయులే అందుకు నిదర్శనమని అన్నారు. ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అంకితభావంతో కృషి చేస్తానని చెప్పారు.