Ind vs Eng: తెలుగోడి కెరీర్ ఇక ముగిసినట్టేనా..?

జాతీయ జట్టులో అవకాశం రావడం అనేది అంత సాధారణ విషయం కాదు. వస్తే నిలబెట్టుకోవడం కూడా అంత సాధారణ విషయం కాదు. ముఖ్యంగా మన తెలుగు ఆటగాళ్లు జాతీయ క్రికెట్ జట్టులో స్థానం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. పలువురు ఆటగాళ్లు ప్రయత్నాలు చేసినా సరే ఒకరు ఇద్దరికి అదృష్టం వరించింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిఎస్ లక్ష్మణ్ మాత్రమే ఎక్కువగా సక్సెస్ అయ్యారు అని చెప్పాలి. ఆ తర్వాత ప్రజ్ఞాన్ ఓజా కాస్త పరవాలేదనిపించాడు.
ఇక హనుమ విహారి అంబటి రాయుడు వంటి వాళ్ళు జట్టులోకి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయారు. కేఎస్ భరత్ కూడా కాస్త పర్వాలేదు అనిపించినా బ్యాటింగ్ లో విఫలం కావడంతో తిరిగి టెస్టు జట్టు లోకి రాలేకపోయాడు. ఇక ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) ఆల్రౌండర్ గా జాతీయ జట్టులోకి అడుగు పెట్టాడు. ఆస్ట్రేలియా పర్యటనలో అతను మెరుగైన ప్రదర్శన చేసిన సరే ఇంగ్లాండ్(England) పర్యటనలో మాత్రం విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత అతనిపై ఒత్తిడి తీవ్రంగా ఉండటంతో పెద్దగా రాణించడం లేదు.
ఇంగ్లాండ్ పర్యటనలో బౌలింగ్ లోకి కాస్త పర్వాలేదనిపించాడు నితీష్ కుమార్. బ్యాటింగ్ లో కీలక సమయంలో వికెట్లు పారేసుకోవడం అతనికి మైనస్ గా మారింది. ఇలాంటి సమయంలో అతనికి దెబ్బ పడే పరిస్థితి తలెత్తింది. వ్యాయామం చేస్తున్న సమయంలో కాలి లిగ్మెంట్ కట్ కావడంతో అతన్ని సీరిస్ నుంచి పూర్తిగా పక్కన పెట్టారు. ఇప్పుడు అతను తిరిగి జాతీయ జట్టులోకి రావాలి అంటే ఫిట్నెస్ తో పాటుగా మంచి ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. జాతీయ క్రికెట్ అకాడమీలో సత్తా చాటాల్సి ఉంటుంది.
దేశవాళి క్రికెట్ కూడా త్వరలో మొదలు కాబోతున్న నేపథ్యంలో నితీష్ కుమార్ రెడ్డి ఎంతవరకు ఆకట్టుకుంటాడనేది చూడాలి. బౌలింగ్ ఆల్రౌండర్ కోసం జట్టు యాజమాన్యం ఎప్పటి నుంచో ఎదురుచూస్తోంది. ఇక యువ ఆటగాళ్లు కూడా జట్టులోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి నితీష్ కుమార్ రెడ్డి తిరిగి జట్టులోకి వస్తాడా లేదంటే అలాగే కనుమరుగైపోతాడా చూడాలి.