Jaishankar: భారత్-చైనా సంబంధాల్లో కొత్త అడుగులు: జైశంకర్

భారత్-చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సాధారణ స్థితికి వస్తున్న నేపథ్యంలో, నియంత్రణ రేఖ (LAC) వద్ద నెలకొన్న ఉద్రిక్తతలను పూర్తిగా తొలగించడంపై ఇరుదేశాలు దృష్టి సారించాలని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar) పిలుపునిచ్చారు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న ఆయన.. ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీతో కీలక సమావేశం నిర్వహించారు. రెండు దేశాల బంధాలు సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలన్న జైశంకర్ (Jaishankar).. అభిప్రాయ భేదాలు సమస్యలుగా, పోటీ ఘర్షణగా మారకూడదుని నొక్కిచెప్పారు. ముఖ్యంగా వాణిజ్యంపై ఎలాంటి నియంత్రణలు, అడ్డంకులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఇటీవల చైనా కీలకమైన ఖనిజాల ఎగుమతులను నిలిపివేసిన నేపథ్యంలో జైశంకర్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) కాంక్లేవ్‌లో పాల్గొనేందుకు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జైశంకర్ (Jaishankar) చైనాకు వెళ్లారు. ఈ సందర్భంగా గతంలో 2024 అక్టోబర్ 23న ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య జరిగిన సమావేశాన్ని ఆయన గుర్తుచేశారు. “ఇరుదేశాల నేతల సమావేశం తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు సానుకూల దిశలో పయనిస్తున్నాయి. వాటిని మరింత వేగవంతం చేయడం మన ఉమ్మడి బాధ్యత,” అని వాంగ్ యీతో అన్నారు. భారత్-చైనా మధ్య స్థిరమైన, నిర్మాణాత్మక సంబంధాలు కేవలం ఇరుదేశాలకే కాకుండా, ప్రపంచానికే మేలు చేస్తాయని జైశంకర్ (Jaishankar) పునరుద్ఘాటించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల్లో, ఆసియాలోని రెండు అతిపెద్ద ఆర్థిక శక్తులు కలిసికట్టుగా ముందుకు సాగడం కీలకమని ఆయన పరోక్షంగా సందేశం ఇచ్చారు.