Jaishankar: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో జైశంకర్ భేటీ

బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar) సమావేశమయ్యారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) విదేశాంగ మంత్రుల సమావేశాల సందర్భంగా ఈ ఉన్నత స్థాయి భేటీ జరిగింది. ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తరపున అధ్యక్షుడు జిన్ పింగ్‌కు శుభాకాంక్షలు తెలియజేసినట్లు జైశంకర్ (Jaishankar) తెలిపారు. భారత్-చైనా సంబంధాలలో ఇటీవల జరిగిన పరిణామాలు, సాధించిన పురోగతి గురించి ఆయనకు వివరించానన్నారు. “నేను బీజింగ్‌లో ఎస్‌సీవో విదేశాంగ మంత్రులతో పాటు అధ్యక్షుడు జిన్ పింగ్‌ను కలిశాను. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తరపున శుభాకాంక్షలు తెలియజేశాను. భారత్-చైనా సంబంధాలలో సాధించిన పురోగతి గురించి ఆయనకు తెలియజేశాను” అని జైశంకర్ (Jaishankar) తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అంతకుముందు చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్, విదేశాంగ మంత్రి వాంగ్ యీలతో కూడా జైశంకర్ విడివిడిగా చర్చలు జరిపారు. ఈ సమావేశాల్లో సరిహద్దు సమస్యలు, దేశాల మధ్య సంబంధాలు, వాణిజ్యంలో అడ్డంకులను తొలగించడానికి కృషి చేయడం తదితర అంశాలను జైశంకర్ (Jaishankar) చర్చించారు.