Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని లేపేస్తాం.. ఇజ్రాయెల్ వార్ మెసేజ్…

పశ్చిమాసియా పూర్తిస్థాయి యుద్ధరంగంగా మారుతోంది. ముఖ్యంగా ఇజ్రాయెల్-ఇరాన్ వార్ కాస్తా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తమ మిలటరీ నాయకత్వాన్ని ఇజ్రాయెల్ హత్య చేయడంతో ఇరాన్ అగ్గిమీద గుగ్గిలమైంది. దీంతో గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేసింది. ఈ పరిణామంతో ఒక్కసారిగా అమెరికా అలర్టైంది. తమ యుద్ధనౌకలు, ఇతర సహాయక సిబ్బందిని .. పశ్చిమాసియా సముద్రతీరానికి తరలిస్తోంది. ఈ సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Iran Supreme Leader Khamenei)ని హతమారిస్తేనే యుద్ధం ముగుస్తుందన్నారు. టెహ్రాన్‌పై టెల్‌అవీవ్ చేస్తున్న దాడులను ఆయన సమర్థించారు. ఇరుదేశాల మధ్య సంఘర్షణను పెంచేకంటే త్వరగా యుద్ధాన్ని ముగించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
ఇరాన్ అస్థిరపరిచే శక్తిగా మారింది..
దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో ఇరాన్ అస్థిరపరిచే శక్తిగా మారింది. అర శతాబ్దంగా ఇరాన్ పాలనతో ప్రతిఒక్కరూ భయపడేవిధంగా సంఘర్షణ వ్యాపించింది. సౌదీ అరేబియాలోని ఆరామ్‌కో చమురు క్షేత్రాలపైనా దాడులు జరిగాయి. ఈ ప్రాంతంలో ఉగ్రవాద వ్యాప్తి, విధ్వంసం, వ్యవస్థలను బలహీనం చేయడం పెరిగి పోయింది’’ అని నెతన్యాహు అన్నారు.
ఇరాన్ అణు లక్ష్యాలు ప్రపంచానికి ప్రమాదకరమని నెతన్యాహు అభివర్ణించారు. ‘‘మేము కేవలం మా శత్రువుతో మాత్రమే యుద్ధం చేయడం లేదు. వారు ఇజ్రాయెల్‌కు, అమెరికాకు మరణం అని నినాదాలు చేస్తున్నారు. మేము సైతం వారి దారిలోనే నడుస్తున్నాం. ఇది త్వరలో అమెరికాకు కూడా చేరుతుంది. ఇరాన్ చేపట్టిన ‘శాశ్వత యుద్ధం’ను అడ్డుకోవడానికి ఇజ్రాయెల్ చర్యలు చేపట్టింది. ఇరాన్ చేపట్టిన శాశ్వత యుద్ధం ప్రపంచాన్ని అణు విపత్తు వైపు నెడుతోంది. అయితే దురాక్రమణను అంతం చేయడం, దుష్ట శక్తులకు ఎదురించి పోరాడడం ద్వారా ఇజ్రాయెల్ దాన్ని అడ్డుకుంటోంది’’ అని నెతన్యాహు అన్నారు.
మరోవైపు ఇరాన్ అణు కార్యక్రమం, శాస్త్రవేత్తలను లక్ష్యంగా చేసుకొని వారిని ‘హిట్లర్ అణు బృందం’గా నెతన్యాహు పోల్చాడు. వారితో ప్రపంచానికి పెను ముప్పు పొంచి ఉందన్నారు. ‘ఈరోజు టెల్ అవివ్, రేపు న్యూయార్క్ కావొచ్చు’ అని అన్నారు. తన అభిప్రాయం ప్రకారం ఇరాన్ దృష్టిలో అమెరికానే తొలి లక్ష్యం అని తెలిపారు.
ఆ చర్చలు నకిలీవి.. అమెరికాను ఇరకాటంలో పెట్టేవి..
మరోవైపు ఇరాన్ దౌత్య చర్యలను నెతన్యాహు తొసిపుచ్చారు. అవి తప్పుదారి పట్టేంచేవన్నారు. వారు అబద్ధాలు, మోసంతో నకిలీ చర్చలను కొనసాగించి అమెరికాను ఇరకాటంలో పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. ఇరాన్ ఉద్దేశాలపై ఇజ్రాయెల్‌కు కచ్చితమైన నిఘా ఉందన్నారు. ఇరాన్ పెంచుతున్న క్షిపణుల తయారీ, అణు కార్యక్రమం కేవలం ఇజ్రాయెల్‌కు మాత్రమే ముప్పు కాదని, అరబ్ దేశాలు, యూరప్, అమెరికాకు సైతం ముప్పే అన్నారు. ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచినందుకు అమెరికాకు, అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కొన్నిసార్లు దుష్ట శత్రువుకు వ్యతిరేకంగా పోరాడాలి. దాన్ని అమెరికా ప్రజలు సహజంగానే అర్థం చేసుకుంటారు. అమెరికా అధ్యక్షుడు సైతం దాన్ని అర్థం చేసుకున్నారు. అందుకు అండగా నిలబడ్డారు అని నెతన్యాహు పేర్కొన్నారు.
మరోవైపు ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈశాన్య టెహ్రాన్‌లోని అండర్‌గ్రౌండ్ బంకర్‌లో ఖమేనీ కుటుంబంతో కలిసి తలదాచుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.