Trump: ఇరాన్ పై పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధమైన ఇజ్రాయెల్.. అమెరికా గ్రీన్ సిగ్నల్..

పశ్చిమాసియాలో అత్యంత బలమైన ముస్లిం దేశం ఇరాన్ (Iran).. కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ ను ఎదురిస్తోంది. అంతే కాదు.. ఉగ్రదండు ఏర్పాటు చేసుకుని.. ఇజ్రాయెల్ పై దాడులకు తెగబడుతోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్ ను ఆయుధపరంగా బలహీనం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ లయన్ రైజింగ్ ప్రారంభించింది ఇజ్రాయెల్. ఇప్పటికే ఇరాన్ ఎయిర్ ఢిపెన్స్ సిస్టమ్ లో మూడోవంతు భాగాన్ని ధ్వంసం చేసిన ఇజ్రాయెల్ (Israel)… ఇప్పుడు నేరుగా టెహ్రాన్ పై దాడికి సిద్ధమైంది. అదీ అమెరికా అనుమతితో…
ఇప్పటివరకూ ఇరాన్ ను నయానో, భయానో బెదిరించి.. దారికి తెచ్చుకోవాలని అగ్రరాజ్యం అమెరికా భావించింది. ఓవైపు ఇజ్రాయెల్ తో దాడులు చేయిస్తూ.. మరోవైపు అణు ఒప్పందంపై సంతకాలు చేయాలంటూ ఒత్తిడి తెచ్చింది. అయితే దీనికి ఇరాన్ అధినాయకత్వం అంగీకరించలేదు. ఫలితంగా యుద్ధం అనివార్యమైంది. ఎందుకంటే ఇప్పటికే ఇరాన్ 90 శాతం శుద్ధి చేసిన యురేనియం నిల్వలు సమీకరిస్తోంది. ఇది కానీ పూర్తయితే.. అమెరికా, ఇజ్రాయెల్.. ప్రమాదంలో పడతాయి. అందుకే ఇరాన్ అణుబాంబు తయారీ చేయడానికి అమెరికా వ్యతిరేకిస్తోంది.
ఇటీవలే అండర్ గ్రౌండ్ మిస్సైల్ సిటీని ఇరాన్..ప్రపంచానికి పరిచయం చేసింది. దీంతో ఇక ఏమాత్రం సమయం లేదని భావించిన అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమయ్యాయి. అయితే ఈదాడుల్లో ఏకంగా ఇరాన్ త్రివిధ దళాధిపతులు మరణించడం పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారడానికి కారణమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంతగా నష్టపోయిన తర్వాత ఇరాన్.. అణు ఒప్పందానికి సిద్ధంగా లేదు. అంతేకాదు.. తాము అణ్వాయుధ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు ఓ ప్రకటన సైతం చేసింది టెహ్రాన్..
ఇక ఇరాన్ పై ఆధిపత్యం సాధించి.. ఆయుధ వ్యవస్థను నాశనం చేయాలని అగ్రరాజ్యం భావిస్తోంది. అందులో భాగంగా టెహ్రాన్ పై నేరుగా గురిపెట్టింది. సాక్షాత్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. నేరుగా టెహ్రాన్ వీడిపోవాలంటూ అక్కడి పౌరులకు సందేశమిచ్చారంటే పరిస్థితి ఎక్కడివరకూ వెళ్లిందో అర్థం చేసుకోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు.. టెహ్రాన్ పౌరుల పరిస్థితి కూడా ఘోరంగా మారింది. ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక.. ఇక్కడే ఉంటే ప్రాణాలు దక్కవని భయంతో వారు బెంబేలెత్తుతున్నారు.